vadapalem
-
నాణ్యతా ప్రమాణాకు తిలోదకాలు
వెంకన్న అన్నదాన సత్రం నిర్మాణంలో అవినీతి బీటలు వారుతున్న పునాదులు వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రం పునాదులు బీటలు వారుతున్నాయి. సుమారు రూ.80 లక్షలతో చేపట్టిన భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు భవన నిర్మాణం పర్యవేక్షణ చేపట్టకపోవడంతో ఽపనులు నాశిరకంగా జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. దానికితోడు బినామీ కాంట్రాక్టర్లకు అనుభవం లేకపోవడంతోనే పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ 2016లో భవన నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు మంజూరు చేసింది. అయితే ఆ పనులపై కన్నెసిన గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్క నేతలు బినామి పేరుతో పనులు సొంతం చేసుకున్నారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. నాశిరకం మెటీరియల్ వాడకం, పునాదిలో ఇసుక ఫిలింగ్ సమయంలో చౌడు మట్టి వాడటం, క్యూరింగ్ నిబంధనలు పాటించక పోవడంతో భవనం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది పూర్తి కావస్తున్నా నేటికీ పూర్తికాకపోవడంపై పలువురు భక్తులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులు మండుటెండల్లో స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. -
టెండరింగ్
వాడపల్లి ఆలయంలో చక్రం తిప్పుతున్న నేతలు ఆదాయానికి గండికొడుతున్న వైనం వాడపల్లి(ఆత్రేయపురం): కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నలుగురు గ్రామ పెద్దలు తిష్టవేశారని పలువురు వెంకన్న భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి చెందిన నలుగురు పచ్చచొక్కా నేతలు ఆలయంలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఆలయ అభివృద్ధి పనులకు జరిగిన టెండర్లలో నలుగురు నాయకులు చక్రం తిప్పి పనులు టెండరింగ్ అయ్యేలా ప్రయత్నాలు చేయడంతో పాటు తమ అనుచరులకే పనులు దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆలయ సిబ్బంది కూడా వారికి తమ వంతు సాయం అందించి స్వామి భక్తిని చాటుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రూ.32.20 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు టెండర్లలో రింగ్ అయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ సిబ్బంది పరోక్ష సహకారంతోనే ఆలయంలో తిష్టవేసిన కొందరు కాంట్రాక్టర్లకు అధికారుల సమక్షంలోనే ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున గుడ్‌విల్ రూపంలో అందించి దేవుడికి శఠగోపం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పోటీకీ వచ్చిన టెండరుదార్లను ప్రలోభాలకు గురిచేయడంతో రూ 32.20 లక్షల విలువైన పనులు 0.01 తక్కువ మొత్తానికి (రూ.32 తగ్గించి) టెండర్లు ఖరారైనట్టు ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి ప్రకటించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే వెంకన్న ఆలయంలో అన్నదాన సత్రానికి ప్రహరీ, ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వనైజ్డ్ మెస్‌కు దేవాదాయ శాఖ రూ.32.20లక్ష లు మంజూరు చేయడంతో పనులు చేపట్టేందుకు ఈ నెల 9న టెండర్లు పిలిచారు. ఆ పనులకు సంబంధించి టెండరుదార్లను ఆహ్వానించేందుకు మొక్కుబడిగా ప్రకటనలు చేసి ఆలయ పరిపాలన సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది గోప్యం పాటించారనే విమర్శలు ఉన్నాయి. స్థానిక పత్రికల్లో టెండర్ నోటీస్ ప్రకటనలు రాకపోవడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతుంది. దీంతో రూ.32.20 లక్షలు పనులకు నాలుగు టెండర్లు మాత్రమే రాగా అందులో రెండు బినామీ అని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయంలో సుమారు రూ.కోటితో పనులు చేపట్టిన కొందరు టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికత పేరుతో బెదిరించి పను లు దక్కించుకున్నారని భక్తులు వాపోతున్నారు. టెండర్ల గురించి మరింత ప్రచారం చేసి ఉంటే 5 శాతం తక్కువకు ఖరారై దేవాదాయ శాఖకు రూ.1.50 లక్షల వరకు ఆదాయం సమకూరి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వాడపల్లి ఆలయ పనుల్లో జరిగిన టెండరు అవకతవకలపై దృష్టిసారించి తిరిగి టెండర్లు నిర్వహించాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు. -
గుర్తింపు తెచ్చే ఏ పాత్రైనా ఓకే!
వర్ధమాన నటి తేజస్విని కొత్తపేట : సినిమా, సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చే ఏ పాత్రనైనా చేస్తానని సినిమా, సీరియల్స్ వర్ధమాన నటి జి.తేజస్విని అన్నారు. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో సహాయ నటిగా రాణిస్తున్న ఆమె కొత్తపేట మండలం వాడపాలెంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ప్రస్తుతం తాను రాధాగోపాలం టీవీ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్‌గా, అమెరికా అమ్మాయిలో పని అమ్మాయిగా, నాగబాబు సీతామహాలక్ష్మిలో జబర్దస్త్ నాగి వైఫ్ క్యారెక్టర్, అగ్నిపూలులో రిపోర్టర్‌గా, నాపేరు మీనాక్షిలో నర్స్ క్యారెక్టర్లో నటిస్తున్నానన్నారు. సంగీత దర్శకుడు కోటిగారి అబ్బాయి హీరోగా నటిస్తున్న టైటానిక్, రాజా చేయివేస్తే, ప్రేమంటే సులువు కాదురా! సినిమాలతో పాటు మళయాళం నటుడు మోహన్‌లాల్ హీరోగా తెలుగు, తమిళం, మళయాళం బాషల్లో (తెలుగులో మనమందరం) సినిమాలో మోహన్‌లాల్ సూపర్‌బజార్ టీమ్ సభ్యురాలిగా నటిస్తున్నట్టు తెలిపారు. -
'ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు'
కాకినాడ (కొత్తపేట) : తెలంగాణా శకుంతలగా అమ్మ, అక్క, లేడీ విలన్ క్యారెక్టర్లలో రాణించాలన్నదే తన ఆకాంక్ష అని వర్ధమాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాసరి పద్మరేఖ తెలిపారు. రాధాగోపాలం, రాములమ్మ తదితర సీరియల్స్, పుష్కర, టైటానిక్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన పద్మరేఖ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం’ పాట చిత్రీకరణ హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుండగా.. అందులో ఒక డ్యాన్సర్ సరిగా చేయకపోతే ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు. చేస్తానని చెప్పాను. అలా సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. సినీ రైటర్ చంద్రబోస్ భార్య, డ్యాన్సర్ సుచిత్రమాస్టర్ నా గురువు. ఆమె వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, విజయశాంతి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను. చేసిన సినిమాలు.. నూతన నటీనటులతో తీసిన ‘మజిలీ’ చిత్రంలో తల్లి పాత్ర, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా ‘టైటానిక్’ అంతర్వేది టు అమలాపురం అనే ఉప శీర్షిక పేరుతో తీసిన చిత్రంలో థర్టీయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైఫ్ క్యారెక్టర్, ఏఎన్ఆర్ మనుమడు సుశాంత్ హీరోగా ‘ఆటాడుకుందాం రా!’ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం డెరైక్టర్‌ను పాకులాడే పాత్ర, పుష్కర సినిమాలో హీరోయిన్ కాజల్‌కు తల్లిగా, భానుచందర్‌కు భార్యగా నటించా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సినిమాలోని ప్రకాష్‌రాజ్ చెల్లెలుగా నటిస్తున్నాను. నటించిన సీరియల్స్.. రాములమ్మలో తల్లి పాత్ర, రాధాగోపాలంలో హీరోయిన్ రాధ పిన్ని (విలన్ షేడ్)పాత్ర పోషిస్తున్నాను. -
అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం
అన్ని భారతీయ భాషా చిత్రాలకు దర్శకురాలిగా పని చేసి, అందరూ మెచ్చుకొనే అగ్రస్థాయి దర్శకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని వర్థమాన దర్శకురాలు ‘సుజి’ అన్నారు. కొరియోగ్రాఫర్‌గా సినీరంగ ప్రవేశం చేసి, దర్శక, నిర్మాతగా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అంజనీ ప్రొడక్షన్స్‌తో కలిసి తన విరించి అకాడమీ ద్వారా నూతన నటీనటులతో ‘బోళాశంకర్’ చిత్రం నిర్మించనున్నామని చెప్పారు. ఆ చిత్రం షూటింగ్‌కు లొకేషన్స్ పరిశీలన కోసం వచ్చిన ‘సుజి’ మండలంలోని వాడపాలెంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రశ్న : ఎవరి ప్రేరణతో డ్యాన్స్ నేర్చుకున్నారు? సుజి : ఎల్.విజయలక్ష్మి అంటే ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ స్క్రీన్‌పై చూశాను. ఆమె స్ఫూర్తిగా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆమే నాకు స్క్రీన్ గురువు. ప్రశ్న : సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? సుజి : మాది ఉద్యోగుల కుటుంబం. నాన్న పోలీసు అధికారి. నన్ను ఐఏఎస్ అధికారిని చేయాలన్నది ఆయన ఆకాంక్ష. కానీ నాకు డ్యాన్స్ అంటే మక్కువ ఎక్కువ. టేపు రికార్డర్ పెట్టుకుని పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా హైదరాబాద్ వచ్చి ముక్కురాజు మాస్టర్, హరీష్‌పాయ్ మాస్టర్ల వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా మొదట చిన్నబ్బులు సినిమాకు పని చేశాను. ప్రశ్న : కొరియోగ్రాఫర్‌గా ఎన్ని సినిమాలకు పని చేసారు? సుజి : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సుమారు 150, కొరియోగ్రాఫర్‌గా 35 చిత్రాలకు పని చేశాను. వాటిలో ప్రధానంగా మౌనమేలనోయి, లగ్నపత్రిక, శేషు, రావే నా చెలియా, దేవీ నాగమ్మ వంటి చిత్రాలున్నాయి. ప్రశ్న : దర్శక నిర్మాతగా ఎప్పుడు మారారు? సుజి : కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూనే దర్శకత్వం కూడా చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆమేరకు పలువురు ప్రముఖ నిర్మాతలను సంప్రదించాను. ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నేనే ‘విరించి అకాడమీ’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి, అనురాగ్, కాజల్ యాదవ్ హీరో హీరోయిన్లుగా ‘మనసా తుళ్ళిపడకే’ చిత్రం నిర్మించాను. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, లాభాలు ఇవ్వకపోయినా మంచి చిత్రం నిర్మించానన్న సంతృప్తినిచ్చింది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లబించాయి. ప్రశ్న : త్వరలో నిర్మించే చిత్రం ఏ తరహాలో ఉంటుంది? సుజి :తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ నిర్ణయించాం. కొత్త, పాత నటీ నటులతో ఈ చిత్రం చేయాలనుకుంటున్నాం. ఇది స్వచ్ఛమైన పల్లెటూరి కామెడీ సినిమా. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఎక్కువ భాగం కోనసీమలో ఈ సినిమా చిత్రీకరించనున్నాం. ప్రశ్న : ఇంకేమైనా చిత్రాలు చేస్తున్నరా? సుజి : ఈ చిత్రం తరువాత మనసా తుళ్ళిపడకే చిత్రాన్ని కన్నడలో చిత్రించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రశ్న : డెరైక్టర్‌గా ఎవరు స్ఫూర్తి? సుజి : ఎవరి స్ఫూర్తీ లేదు. దర్శకత్వ శాఖలో ఎవ్వరివద్దా అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. కొరియోగ్రాఫర్‌గా ఉన్న అనుభవం తోడ్పడుతోంది. ప్రశ్న : దర్శక నిర్మాతగా మీ లక్ష్యం? సుజి : దర్శకురాలిగా ఒక తెలుగమ్మాయి అన్ని భాషల్లోనూ టాప్ లెవెల్లో ఉందని అందరిచేతా అనిపించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. అలాగే విరించి అకాడమీ బ్యానర్లో ఎక్కువమంది కొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ, లో బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరాలన్నది నా లక్ష్యం