'ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు'
కాకినాడ (కొత్తపేట) : తెలంగాణా శకుంతలగా అమ్మ, అక్క, లేడీ విలన్ క్యారెక్టర్లలో రాణించాలన్నదే తన ఆకాంక్ష అని వర్ధమాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాసరి పద్మరేఖ తెలిపారు. రాధాగోపాలం, రాములమ్మ తదితర సీరియల్స్, పుష్కర, టైటానిక్ తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన పద్మరేఖ కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం’ పాట చిత్రీకరణ హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతుండగా.. అందులో ఒక డ్యాన్సర్ సరిగా చేయకపోతే ఎన్టీఆర్ నన్ను పిలిచి నువ్వు చేస్తావా? అన్నారు. చేస్తానని చెప్పాను. అలా సినిమాల్లో తొలి అవకాశం దక్కింది. సినీ రైటర్ చంద్రబోస్ భార్య, డ్యాన్సర్ సుచిత్రమాస్టర్ నా గురువు. ఆమె వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, విజయశాంతి ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను.
చేసిన సినిమాలు..
నూతన నటీనటులతో తీసిన ‘మజిలీ’ చిత్రంలో తల్లి పాత్ర, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా ‘టైటానిక్’ అంతర్వేది టు అమలాపురం అనే ఉప శీర్షిక పేరుతో తీసిన చిత్రంలో థర్టీయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైఫ్ క్యారెక్టర్, ఏఎన్‌ఆర్ మనుమడు సుశాంత్ హీరోగా ‘ఆటాడుకుందాం రా!’ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం డెరైక్టర్‌ను పాకులాడే పాత్ర, పుష్కర సినిమాలో హీరోయిన్ కాజల్‌కు తల్లిగా, భానుచందర్‌కు భార్యగా నటించా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సినిమాలోని ప్రకాష్‌రాజ్ చెల్లెలుగా నటిస్తున్నాను.
నటించిన సీరియల్స్..
రాములమ్మలో తల్లి పాత్ర, రాధాగోపాలంలో హీరోయిన్ రాధ పిన్ని (విలన్ షేడ్)పాత్ర పోషిస్తున్నాను.