అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం | choreographer new director Suzi Special | Sakshi
Sakshi News home page

అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం

Published Sun, Nov 30 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం

అన్ని భాషల్లోనూ అగ్రస్థాయి దర్శకురాలు కావాలన్నదే లక్ష్యం

అన్ని భారతీయ భాషా చిత్రాలకు దర్శకురాలిగా పని చేసి, అందరూ మెచ్చుకొనే అగ్రస్థాయి దర్శకురాలిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని వర్థమాన దర్శకురాలు ‘సుజి’ అన్నారు. కొరియోగ్రాఫర్‌గా సినీరంగ ప్రవేశం చేసి, దర్శక, నిర్మాతగా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అంజనీ ప్రొడక్షన్స్‌తో కలిసి తన విరించి అకాడమీ ద్వారా నూతన నటీనటులతో ‘బోళాశంకర్’ చిత్రం నిర్మించనున్నామని చెప్పారు. ఆ చిత్రం షూటింగ్‌కు లొకేషన్స్ పరిశీలన కోసం వచ్చిన ‘సుజి’ మండలంలోని వాడపాలెంలో విలేకర్లతో మాట్లాడారు.  
 
 
 ప్రశ్న : ఎవరి ప్రేరణతో డ్యాన్స్ నేర్చుకున్నారు?
 సుజి : ఎల్.విజయలక్ష్మి అంటే ఎంతో ఇష్టం. ఆమె డ్యాన్స్ స్క్రీన్‌పై చూశాను. ఆమె స్ఫూర్తిగా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆమే నాకు స్క్రీన్ గురువు.
 
 ప్రశ్న :  సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
 సుజి : మాది ఉద్యోగుల కుటుంబం. నాన్న పోలీసు అధికారి. నన్ను ఐఏఎస్ అధికారిని చేయాలన్నది ఆయన ఆకాంక్ష. కానీ నాకు డ్యాన్స్ అంటే మక్కువ ఎక్కువ. టేపు రికార్డర్ పెట్టుకుని పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా హైదరాబాద్ వచ్చి ముక్కురాజు మాస్టర్, హరీష్‌పాయ్ మాస్టర్ల వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా మొదట చిన్నబ్బులు సినిమాకు పని చేశాను.
 
 ప్రశ్న :  కొరియోగ్రాఫర్‌గా ఎన్ని సినిమాలకు పని చేసారు?
 సుజి : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సుమారు 150, కొరియోగ్రాఫర్‌గా 35 చిత్రాలకు పని చేశాను. వాటిలో ప్రధానంగా మౌనమేలనోయి, లగ్నపత్రిక, శేషు, రావే నా చెలియా, దేవీ నాగమ్మ వంటి చిత్రాలున్నాయి.
 
 ప్రశ్న :  దర్శక నిర్మాతగా ఎప్పుడు మారారు?
 సుజి : కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూనే దర్శకత్వం కూడా చేపట్టాలన్న ఆలోచన వచ్చింది. ఆమేరకు పలువురు ప్రముఖ నిర్మాతలను సంప్రదించాను. ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో నేనే ‘విరించి అకాడమీ’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి, అనురాగ్, కాజల్ యాదవ్ హీరో హీరోయిన్లుగా ‘మనసా తుళ్ళిపడకే’ చిత్రం నిర్మించాను. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, లాభాలు ఇవ్వకపోయినా మంచి చిత్రం నిర్మించానన్న సంతృప్తినిచ్చింది. పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు లబించాయి.
 
 ప్రశ్న :  త్వరలో నిర్మించే చిత్రం ఏ తరహాలో ఉంటుంది?
 సుజి :తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ నిర్ణయించాం. కొత్త, పాత నటీ నటులతో ఈ చిత్రం చేయాలనుకుంటున్నాం. ఇది స్వచ్ఛమైన పల్లెటూరి కామెడీ సినిమా. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో.. ఎక్కువ భాగం కోనసీమలో ఈ సినిమా చిత్రీకరించనున్నాం.
 
 ప్రశ్న :  ఇంకేమైనా చిత్రాలు చేస్తున్నరా?
 సుజి : ఈ చిత్రం తరువాత మనసా తుళ్ళిపడకే చిత్రాన్ని కన్నడలో చిత్రించేందుకు ప్లాన్ చేస్తున్నాం.
 
 ప్రశ్న :  డెరైక్టర్‌గా ఎవరు స్ఫూర్తి?
 సుజి : ఎవరి స్ఫూర్తీ లేదు. దర్శకత్వ శాఖలో ఎవ్వరివద్దా అసిస్టెంట్‌గా కూడా పని చేయలేదు. కొరియోగ్రాఫర్‌గా ఉన్న అనుభవం తోడ్పడుతోంది.
 
 ప్రశ్న :  దర్శక నిర్మాతగా మీ లక్ష్యం?
 సుజి : దర్శకురాలిగా ఒక తెలుగమ్మాయి అన్ని భాషల్లోనూ టాప్ లెవెల్‌లో ఉందని అందరిచేతా అనిపించుకోవాలన్నదే ప్రధాన లక్ష్యం. అలాగే విరించి అకాడమీ బ్యానర్‌లో ఎక్కువమంది కొత్త నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తూ, లో బడ్జెట్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరాలన్నది నా లక్ష్యం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement