పారిపోయిన జీవిత ఖైదీ అరెస్ట్
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జిల్లా ఓపన్ ఎయిర్ జైలు నందు ఇటీవల పారిపోయిన ఓ జీవిత ఖైదీని అరెస్ట్ చేసినట్లు జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓపన్ ఎయిర్ జైలు నందు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనంతపురం మహాత్మాగాంధీ కాలనీకి చెందిన వడ్డే చంద్రశేఖర్‌రెడ్డికి 2004 మార్చిలో హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. ఐదేళ్లు పూర్తయిన తర్వాత 2009లో అనంతపురం ఓపన్ ఎయిర్‌జైలుకు తీసుక వచ్చారు.
ఇక్కడ జైలు నందు వ్యవసాయ పనులు చేసుకుంటూ శిక్షను అనుభవిస్తూ ఉండేవాడు. అయితే ముద్దాయి చంద్రశేఖర్‌రెడ్డి జనవరి 2013లో అధికారులకు కల్లుకప్పి పారిపోయాడు. అప్పటిలో బీకేఎస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి జైలు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని అన్నా నగర్లో ఉన్నట్లు సమాచారం అందడంతో హెడ్ వార్డెన్ క్రిష్ణయ్య, వార్డెన్ రంగనాయక్‌లు గురువారం చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.