'ఒక్కో మహిళ ఒక్కో మమతా బెనర్జీ కావాలి'
విజయనగరం(భోగాపురం): ఎయిర్పోర్టు బాధిత గ్రామాల్లో ఒక్కో మహిళ ఒక్కో మమతాబెనర్జీ కావాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. భోగాపురం మండలంలో విమానాశ్రయ బాధిత గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అభివృద్ధి పేరిట లక్షల ఎకరాలు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గ్రామాలకు ఎర్ర బస్సు వేయలేరు కానీ ఎయిర్పోర్టు, మెట్రో రైలు అంటూ విదేశీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్రాన్ని ధారాదత్తం చేసేందుకు బాబు ప్రయత్నించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
గూడెపువలసలో 13వ రోజు రిలేనిరాహార దీక్షలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ..పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రైతుల తరఫున రాజీ లేని పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఓడించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మీ గ్రామాలు, భూములు కాజేసేందుకు కుట్ర పన్నుతున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మొక్కవోని ధైర్యంతో ఉద్యమించాలని అన్నారు. వృద్ధ మహిళలు సైతం రిలేనిరాహారదీక్షలో పాల్గొనడం గర్వంగా ఉందని, ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.