అక్రమ నిర్మాణాలు తొలగింపు
హైదరాబాద్: నగరంలో శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో దేవాదాయశాఖ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఓ వ్యాపారి ఈ ఆలయ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి సంబంధిత అధికారులకు కొరక రాని కొయ్యగా తయారయ్యాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న దేవాదాయ శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల సహాయంతో అక్రమంగా నిర్మించిన కూరగాయల దుకాణాన్ని తొలగించారు.
ఆక్రమణను కూల్చివేసే సమయంలో కబ్జాదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. పలువురు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ స్థలం ఆలయానికి సంబంధించినదని, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నామని శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో బాలాజీ తెలిపారు. మూడు గంటల పాటు ఈ కూల్చివేత పనులు చేపట్టారు. కూరగాయల దుకాణం తొలగించిన ప్రాంతంలో వెంటనే సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేస్తామని ఈవో బాలాజీ తెలిపారు. ఈ స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇక నుంచి ఇక్కడ తమ పర్యవేక్షణ ఉంటుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రజాపయోజన కార్యక్రమాలకు వినియోగించాలని శ్రీనగర్ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.