సోనీ హైబ్రిడ్ వయో ఫ్లిప్
న్యూఢిల్లీ: జపాన్ టెక్నాలజీ దిగ్గజం సోనీ కంపెనీ, హైబ్రిడ్ ల్యాప్‌టాప్‌లు, వయో ఫ్లిప్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ల్యాప్‌టాప్‌గా లేదా ట్యాబ్లెట్గా ఉపయోగించే ఈ టూ-ఇన్-వన్‌లను 13, 14, 15 అంగుళాల సైజుల్లో అందిస్తున్నామని సోనీ వయో ఇండియా ప్రోడక్ట్ మేనేజర్ షోజి ఒమ తెలిపారు. వీటి ధరలు రూ. 94,990 నుంచి రూ. 1,19,990 రేంజ్లో ఉన్నాయని వివరించారు. విండోస్ 8 ఓఎస్‌పై పనిచేసే ఈ టూ-ఇన్-వన్‌లను ఫోర్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5, ఐ7 ప్రాసెసర్లతో రూపొందించామని, సోనీ ట్రిల్యుమినస్ డిస్ప్లే టెక్నాలజీతో కూడిన ఫుల్ హెచ్డీ స్క్రీన్ ప్రత్యేకత అని తెలిపారు.
వీటిని కొనుగోలు చేస్తే రూ. 12,990 విలువైన ప్రీమియం హెడ్‌ఫోన్ ఉచితమని తెలిపారు. అంతేకాకుండా కొనుగోలుదారులు జైవ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని 3 నెలల వరకూ అపరిమితమైన పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా పని చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే వారి కోసం ఈ టూ ఇన్ వన్ డివైస్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి హైబ్రిడ్ పరికరాల మార్కెట్ శైశవ దశలోనే ఉందని, 1-2 ఏళ్లలో పుంజుకోవచ్చని వివరించారు. అప్పటికల్లా రూ. 50,000-60,000 రేంజ్లో మరిన్ని పరికరాలు అందుబాటులో వస్తాయని చెప్పారు.