ఓపీఎస్ వర్గంతో చర్చలకు కమిటీ
చెన్నై: అన్నాడీఎంకేలో చీలిక వర్గాలు విలీనం దిశగా మరో ముందడుగు పడింది. ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గంతో చర్చలకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి(ఈపీఎస్) ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ ఆర్. వైద్యలింగం ఈ కమిటీ నేతృత్వం వహిస్తారు. మంత్రులు సెంగొట్టయన్, డి. జయకుమార్, సి. శ్రీనివాసన్ సభ్యులుగా ఉంటారు. ఓపీఎస్ వర్గంతో ఈ కమిటీ విలీన చర్చలు జరపనుంది.
శశికళ వర్గాన్ని బయటకు పంపడంతో ఈపీఎస్ కూటమితో చర్చలకు పన్నీస్ సెల్వం మొగ్గుచూపారు. అయితే సీఎం పీఠం, పార్టీ పదవి తనకే కావాలని ఓపీఎస్ పట్టుబడుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. పన్నీర్ సెల్వం వర్గం ఎటువంటి షరతులు విధించలేదని అంటూనే ముఖ్యమంత్రిని మార్చేది లేదని ఈపీఎస్ వర్గం చెబుతుండడం గమనార్హం. పార్టీని బతికించుకోవడానికే విలీనానికి సిద్ధపడ్డామని ఇరువర్గాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.