12 గౌడ కుటుంబాల గ్రామ బహిష్కరణ
నిజామాబాద్ క్రైం : జిల్లాలోని బిచ్కుంద మండలం వాజీద్‌నగర్‌కు చెందిన 12 గౌడ కుటుంబాలకు మున్నూర్‌కాపు సంఘం గ్రామ బహిష్కరణ విధించింది. బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలు మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌ను కలిసి తమను గ్రామ బహిష్కరణ చేసిన మున్నూర్‌కాపు సంఘానికి చెందిన 21 మందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో జరిగిన జాతరకు చందా డబ్బులు ఇవ్వని కారణంగా తమపై కక్ష గట్టిన మున్నూర్‌కాపు సభ్యులు గ్రామ బహిష్కరణ చేసి సహాయ నిరాకరణ చేశారని తెలిపారు. ఈ నెల 22న గౌడ కులానికి చెందిన మహిళ చనిపోతే ఆమె అంత్యక్రియలు నిర్వహించే వారిని సైతం రాకుండా అడ్డుకున్నారని, దాంతో తామే అంత్యక్రియల పనులు చేసుకున్నట్లు ఎస్పీతో వాపోయారు. గ్రామ బహిష్కరణ చేసిన 21 మందిపై బిచ్కుంద పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఐదుగురిపైనే కేసు నమెదు చేశారని ఎస్పీకి తెలిపారు. మున్నూర్‌కాపు సంఘం వారిపై పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, రూ. ఒక లక్ష చెల్లించాలని లేకుంటే తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. మున్నూర్‌కాపు సంఘం సభ్యుల బారి నుంచి తమను కాపాడి న్యాయం చేయాలని ఎస్పీను కోరారు.