vakka thota
-
వక్క సాగు.. లాభాలు బాగు
సాక్షి, పుట్టపర్తి: వక్క.. శ్రీసత్యసాయి జిల్లా రైతుల కష్టానికి ప్రతిఫలం ఇస్తోంది. ఒకసారి పంటవేస్తే దీర్ఘకాలం దిగుబడి వస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో అధిక దిగుబడులు సాధించవచ్చు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వక్కసాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో అమరాపురం, గుడిబండ, అగళి, రొళ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల రైతులు దశాబ్దాలుగా వక్క తోటలు సాగుచేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత దిగుబడి ఎకరాలో 450 నుంచి 500 వక్క మొక్కలు నాటుతున్నారు. ఐదేళ్ల వరకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఐదేళ్ల తర్వాత ఏటా దిగుబడి వస్తుంది. ధరలు బాగుంటే ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకు వస్తాయి. ఒకసారి పంట వేస్తే 45 ఏళ్ల వరకు అదాయం వస్తూనే ఉంటుంది. హిందూ సంప్రదాయంలో వక్క లేదా పోక చెక్కకు అధిక ప్రాధాన్యం ఉంది. వీటిని శుభకార్యాల్లో విరివిగా వినియోగిస్తారు. పెరుగుతున్న ఆదరణ వక్క చెట్టు నుంచి గరిష్టంగా క్వింటాలు చొప్పున పచ్చి వక్కకాయలు వస్తాయి. వాటి నుంచి 30 శాతం వక్క వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే వక్క మొక్కలకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం ఉండదు. వక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒకసారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. పెట్టుబడి తక్కువగా ఉండడంతోపాటు అధిక లాభాలు ఉన్నందున వక్క తోటల సాగుకు ఆదరణ లభిస్తోంది. స్థానికంగానే నర్సరీలు కొందరు రైతులు వక్క తోటల నర్సరీలు పెంచుతున్నారు. తొలుత రైతులు ఎండబెట్టి వలిచిన వక్కను తీసుకొచ్చి పాలిథీన్ కవర్లో విత్తనం వేసి నీరు పోస్తారు. పదిరోజుల తర్వాత విత్తనం నుంచి మొక్క వస్తుంది. రెండేళ్ల పాటు నీరు, ఎరువు అందిస్తారు. తర్వాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు దూరంలో మొక్కలు నాటుతారు. మరికొందరు తాము పండించిన వక్క కాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పచ్చికాయల నుంచి పీచు వేరుచేసిన అనంతరం వేడినీటిలో గంటన్నర పాటు కాయల నుంచి వేరుచేసిన వక్కను ఉడికిస్తారు. తర్వాత పదిరోజులు ఆరబెడితే వక్కగా మారుతుంది. కర్ణాటక మార్కెట్‌కు.. రైతులు వక్కను పండిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్క రాష్ట్రం కర్ణాటకకు తరలిస్తున్నారు. కర్ణాటకలోని శిర, హిరియూర్, చిత్రదుర్గంలోని మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముతున్నారు. పలువురు వ్యాపారులు ఇక్కడ తోటల వద్దకే వచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు వక్క ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒకసారి పంట కోత ఉంటుంది. కొందరు చెట్లపైనే పచ్చి వక్కలను వ్యాపారులకు అమ్మేస్తారు. రాష్ట్రంలోనే అమరాపురం టాప్ శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా 5,171.3 ఎకరాల్లో వక్క పంట సాగులో ఉంది. అమరాపురం మండలంలో 1,829 ఎకరాల్లో, రొళ్లలో 1,128, గుడిబండలో 970, అగళిలో 811, మడకశిరలో 190, హిందూపురంలో 97, లేపాక్షిలో 41, చిలమత్తూరులో 29, రొద్దంలో 27, పరిగిలో 25, పెనుకొండలో 13, సోమందేపల్లిలో 8, కొత్తచెరువు మండలంలో రెండెకరాల్లో వక్క సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలోనే వక్కసాగు అత్యధికంగా అమరాపురం మండలంలోనే చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోను వక్క కొంతమేర సాగులోకి వచ్చింది. ఏటా రూ.5 లక్షల ఆదాయం నేను 20 ఏళ్లుగా మూడెకరాల్లో వక్క సాగుచేస్తున్నా. ఏటా ఖర్చులు పోను రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దిగుబడిని పొరుగు రాష్ట్రం కర్ణాటక మార్కెట్‌కు తరలిస్తుంటాం. సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో రవాణా ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. – నారాయణప్ప, టీడీపల్లి, రొళ్ల మండలం మార్కెటింగ్ సమస్య ఉంది ఇరవై ఏళ్లుగా రెండున్నర ఎకరాల్లో వక్క సాగుచేస్తున్నాం. ఏటా రూ.4 లక్షల ఆదాయం వస్తోంది. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకకు తరలిస్తున్నాం. డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉంటాయి. – రవికుమార్, బీసీహళ్లి, రొళ్ల మండలం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఉండటంతో చాలామంది రైతులు వక్కసాగుకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అమరాపురం, గుడిబండ, రొళ్ల ప్రాంతాల్లో వక్క పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లో కూడా సాగుచేస్తున్నారు. వక్క పంటకు పక్క రాష్ట్రం కర్ణాటకలో మంచి గిరాకీ ఉంది. వక్క నార్కోటిక్స్ విభాగంలోకి వస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. రాయితీలు వర్తించవు. – చంద్రశేఖర్, శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖాధికారి -
తమలపాకు.. పోక సాగు చేస్తున్న కోనసీమ రైతులు
సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తరాదికి కోనసీమ తమలపాకు పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్మాల్కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది. బుట్టకట్టుబడి కళాత్మకం ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు. కేరళకు కోనసీమ వక్క కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది. కిళ్లీలకు అధికం కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ. పంట తగ్గినా డిమాండ్ ఉంది మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది. – మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం స్థానికంగా కూడా డిమాండ్ తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు. – గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం పూజా సుపారీ ప్రత్యేకం కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది. – కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం -
వక్కతోటకు నిప్పు
అమరాపురం (మడకశిర) : అమరాపురం మండలం తమ్మడేపల్లిలో రైతు నాగరాజుకు చెందిన వక్కతోటకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. శుక్రవారం ఉదయం తోటలోకి వెళ్లి చూడగా 25 వక్కచెట్లు, 25 సెంట్ల భూమిలోని తమలపాకు తీగ, ఐదు కొబ్బరి చెట్లు, అరిటి చెట్లు కాలిబూడిదైనట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. దానిమ్మ చెట్లకు నిప్పు మడకశిర రూరల్ : తడకలపల్లి సమీపంలో రైతు మురళీకృష్ణ సాగు చేసిన దానిమ్మతోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దానిమ్మ, మామిడి, కొబ్బరి, చింతచెట్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. దాదాపు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఉద్యాన అధికారులు పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరాడు.