సాక్షి, పుట్టపర్తి: వక్క.. శ్రీసత్యసాయి జిల్లా రైతుల కష్టానికి ప్రతిఫలం ఇస్తోంది. ఒకసారి పంటవేస్తే దీర్ఘకాలం దిగుబడి వస్తోంది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులతో అధిక దిగుబడులు సాధించవచ్చు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వక్కసాగుకు అనుకూల వాతావరణం ఉండటంతో అమరాపురం, గుడిబండ, అగళి, రొళ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల రైతులు దశాబ్దాలుగా వక్క తోటలు సాగుచేస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత దిగుబడి
ఎకరాలో 450 నుంచి 500 వక్క మొక్కలు నాటుతున్నారు. ఐదేళ్ల వరకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఐదేళ్ల తర్వాత ఏటా దిగుబడి వస్తుంది. ధరలు బాగుంటే ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం వస్తుంది. ఎకరా తోట నుంచి ఎండబెట్టిన వక్కలు ఆరు క్వింటాళ్ల వరకు వస్తాయి. ఒకసారి పంట వేస్తే 45 ఏళ్ల వరకు అదాయం వస్తూనే ఉంటుంది. హిందూ సంప్రదాయంలో వక్క లేదా పోక చెక్కకు అధిక ప్రాధాన్యం ఉంది. వీటిని శుభకార్యాల్లో విరివిగా వినియోగిస్తారు.
పెరుగుతున్న ఆదరణ
వక్క చెట్టు నుంచి గరిష్టంగా క్వింటాలు చొప్పున పచ్చి వక్కకాయలు వస్తాయి. వాటి నుంచి 30 శాతం వక్క వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే వక్క మొక్కలకు రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం ఉండదు. వక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒకసారి మాత్రమే వేస్తారు. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదులుతారు. వక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. పెట్టుబడి తక్కువగా ఉండడంతోపాటు అధిక లాభాలు ఉన్నందున వక్క తోటల సాగుకు ఆదరణ లభిస్తోంది.
స్థానికంగానే నర్సరీలు
కొందరు రైతులు వక్క తోటల నర్సరీలు పెంచుతున్నారు. తొలుత రైతులు ఎండబెట్టి వలిచిన వక్కను తీసుకొచ్చి పాలిథీన్ కవర్‌లో విత్తనం వేసి నీరు పోస్తారు. పదిరోజుల తర్వాత విత్తనం నుంచి మొక్క వస్తుంది. రెండేళ్ల పాటు నీరు, ఎరువు అందిస్తారు. తర్వాత రైతులు తమ పొలాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు దూరంలో మొక్కలు నాటుతారు. మరికొందరు తాము పండించిన వక్క కాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పచ్చికాయల నుంచి పీచు వేరుచేసిన అనంతరం వేడినీటిలో గంటన్నర పాటు కాయల నుంచి వేరుచేసిన వక్కను ఉడికిస్తారు. తర్వాత పదిరోజులు ఆరబెడితే వక్కగా మారుతుంది.
కర్ణాటక మార్కెట్‌కు..
రైతులు వక్కను పండిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్క రాష్ట్రం కర్ణాటకకు తరలిస్తున్నారు. కర్ణాటకలోని శిర, హిరియూర్, చిత్రదుర్గంలోని మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముతున్నారు. పలువురు వ్యాపారులు ఇక్కడ తోటల వద్దకే వచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు వక్క ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. వక్క పంట కోత సాధారణంగా జూలై నెలలో ప్రారంభమవుతుంది. డిసెంబర్ ఆఖరు వరకు కోస్తారు. నెలకు ఒకసారి పంట కోత ఉంటుంది. కొందరు చెట్లపైనే పచ్చి వక్కలను వ్యాపారులకు అమ్మేస్తారు.
రాష్ట్రంలోనే అమరాపురం టాప్
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా 5,171.3 ఎకరాల్లో వక్క పంట సాగులో ఉంది. అమరాపురం మండలంలో 1,829 ఎకరాల్లో, రొళ్లలో 1,128, గుడిబండలో 970, అగళిలో 811, మడకశిరలో 190, హిందూపురంలో 97, లేపాక్షిలో 41, చిలమత్తూరులో 29, రొద్దంలో 27, పరిగిలో 25, పెనుకొండలో 13, సోమందేపల్లిలో 8, కొత్తచెరువు మండలంలో రెండెకరాల్లో వక్క సాగుచేస్తున్నారు. మన రాష్ట్రంలోనే వక్కసాగు అత్యధికంగా అమరాపురం మండలంలోనే చేస్తున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోను వక్క కొంతమేర సాగులోకి వచ్చింది.
ఏటా రూ.5 లక్షల ఆదాయం
నేను 20 ఏళ్లుగా మూడెకరాల్లో వక్క సాగుచేస్తున్నా. ఏటా ఖర్చులు పోను రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దిగుబడిని పొరుగు రాష్ట్రం కర్ణాటక మార్కెట్‌కు తరలిస్తుంటాం. సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో రవాణా ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. – నారాయణప్ప, టీడీపల్లి, రొళ్ల మండలం
మార్కెటింగ్ సమస్య ఉంది
ఇరవై ఏళ్లుగా రెండున్నర ఎకరాల్లో వక్క సాగుచేస్తున్నాం. ఏటా రూ.4 లక్షల ఆదాయం వస్తోంది. అయితే స్థానికంగా మార్కెట్ లేకపోవడంతో కర్ణాటకకు తరలిస్తున్నాం. డిమాండ్‌కు అనుగుణంగా ధరలు ఉంటాయి. – రవికుమార్, బీసీహళ్లి, రొళ్ల మండలం
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఉండటంతో చాలామంది రైతులు వక్కసాగుకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అమరాపురం, గుడిబండ, రొళ్ల ప్రాంతాల్లో వక్క పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లో కూడా సాగుచేస్తున్నారు. వక్క పంటకు పక్క రాష్ట్రం కర్ణాటకలో మంచి గిరాకీ ఉంది. వక్క నార్కోటిక్స్ విభాగంలోకి వస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. రాయితీలు వర్తించవు.
– చంద్రశేఖర్, శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment