సాక్షి, అమలాపురం: కోనసీమలో పండే కొబ్బరి.. కోకో... చేపలు... రొయ్యలకే కాదు. ఇక్కడ పండే తమలపాకు, పోక (వక్క)కు సైతం దేశంలో మంచి డిమాండ్ ఉంది. తమలపాకు, పోకకు ఉత్తర... దక్షిణ భారత దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒకప్పటి తమలపాకు సాగు విస్తీర్ణం తగ్గినా... అడపాదడపా ధరలు తగ్గుతున్నా కూడా ఇక్కడ తమలపాకు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది.. పోక సైతం ఉత్తర, దక్షిణ భారతాలకు ఎగుమతి అవుతుండడం గమనార్హం. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న ఈ రెండు పంటల విలువ నెలకు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా.
ఉత్తరాదికి కోనసీమ తమలపాకు
పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి లంక గ్రామాల్లో తమలపాకు సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం తగ్గినా ఇక్కడ 218.24 ఎకరాల్లో పంట పండుతోంది. గన్నవరం లంకలను ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే చాకలిపాలెం, కనకాయిలంక, దొడ్డిపట్ల వంటి ప్రాంతాల్లో పండే తమలపాకు సైతం ఈ జిల్లా నుంచే ఎగుమతవుతోంది. మహారాష్ట్రలోని ముంబై, పూనే, నాగపూర్, అమరావతి, బుషావళీ, యావత్‌మాల్‌కు వెళుతోంది. అక్కడి నుంచి గుజరాత్‌లోని సూరత్, వడోదర, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని కాండ్వా, ఇండోర్‌లతోపాటు ఛత్తీస్‌గఢ్‌లకు మన తమలపాకును ఎగుమతి చేస్తారు. పొన్నూరు, కళ్లీ, పావడ రకాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి రోజుకు సగటున రెండు లారీల చొప్పున ఎగుమతి కాగా, ఇప్పుడు పశ్చిమ నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ ఎగుమతి జరుగుతోంది.
బుట్టకట్టుబడి కళాత్మకం
ఇతర రాష్ట్రాలకు తమలపాకు ఎగుమతి చేసేందుకు వెదురుబుట్టలలో వట్టిగడ్డి వేసి తడిపిన 150 తమలపాకును ఒక మోద (పంతం) చొప్పున కట్టుబడి కడతారు. ఇది ఎంతో కళాత్మకంగా ఉంటుంది. బుట్టకు వచ్చి 20 మోదలు (3వేల) ఆకులుంటాయి. అన్ సీజన్ కావడంతో బుట్ట ధర రూ.600 వరకు ఉంది. ఈ ఏడాది సీజన్‌లో రూ.1,200 వరకు పలికింది. స్థానికంగా ఎగుమతి చేసే తమలపాకును పెద్దబుట్టలో 100 మోదలు (15 వేల ఆకులు)లు ఉంచి ఎగుమతి చేస్తారు.
కేరళకు కోనసీమ వక్క
కోనసీమలో అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతోపాటు ద్వారపూడి మండలాల్లో సుమారు 386 ఎకరాలలో పోక సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో గట్ల మీద విరివిరిగా కూడా సాగవుతోంది. దేశవాళీ రకం మల్నాడు (కర్ణాటక రకం), హైబ్రీడ్‌లో మంగళ, సుమంగళను సాగుచేస్తున్నారు. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సాకు పోక అధికంగా ఎగుమతి అవుతోంది.
పోక విస్తృతంగా పండే కేరళలో దిగుబడి తగ్గడంతో ఇక్కడ నుంచి ఆ రాష్ట్రానికి ఎగుమతి అవుతుండడం విశేషం. ప్రస్తుతం దీని ధర కేజీ రూ.400 వరకు ఉంది. ఎర్రచెక్కలు (పూజా సుపారీ) తయారీ ప్రత్యేకం. పోక చెక్కలను మరిగేనీటిలో కవిరి, సున్నంతో కలిపి ఉడకబెడతారు. ఇలా చేయడం వల్ల పోక చెక్కలకు ఎరుపు రంగు వస్తోంది. ఎర్రచెక్కల కేజీ ధర రూ.450 నుంచి 500 వరకు ఉంటుంది.
కిళ్లీలకు అధికం
కోనసీమ నుంచి వెళుతున్న తమలపాకు, వక్కలను కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. గోదావరి నీటి మాహత్మ్యమో ఏమో కాని కోనసీమలో పండే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు దీని కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. వీటితో తయారు చేసే కిళ్లీలకు డిమాండ్ ఎక్కువ. ఉత్తర, దక్షణాదిలలో జరిగే శుభ కార్యక్రమాలలో సైతం వీటి వినియోగం ఎక్కువ.
పంట తగ్గినా డిమాండ్ ఉంది
మన ప్రాంతంలో పండే తమలపాకుకు మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ నుంచే మిగిలిన రాష్ట్రాలకు వెళుతోంది. మన దగ్గర లేకపోతేనే మిగిలిన ప్రాంతాల్లో కొంటారు. ఇప్పుడు సీజన్ కాకపోవడం వల్ల ధర తగ్గింది. పెట్టుబడులు పెరగడం వల్ల తమలపాకు సాగు కష్టాలతో కూడుకున్నదిగా మారిపోయింది.
– మయిగాపుల రాంబాబు, గోపాలపురం, రావులపాలెం మండలం
స్థానికంగా కూడా డిమాండ్
తమలపాకుకు ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా స్థానికంగా కూడా డిమాండ్ ఉంది. ఇక్కడ వ్యాపారులకు పంపాల్సి వస్తే 100 మోదలు పంపుతాము. స్థానికంగా కూడా కిళ్లీలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యక్రమాలకు తమలపాకును అధికంగా వినియోగిస్తారు.
– గోవిందరాజులు, గోపాలపురం, రావులపాలెం మండలం
పూజా సుపారీ ప్రత్యేకం
కాయల నుంచి పోక చెక్కలను తయారు చేయడం శ్రమతో కూడుకున్నదే. వక్కలను వేరు చేసి ఎండబెట్టడం, వచ్చిన దానిని గ్రేడ్ చేసి ప్యాకింగ్ చేయడం మేమే చేస్తాం. ఒక విధంగా ఇది శ్రమతో కూడుకున్నదే. పూజా సుపారీని మాత్రం ప్రత్యేకంగా తయారు చేస్తాం. అందుకే దీనికి ఎక్కువ ధర ఉంటుంది.
– కడలి దుర్గాభవాని, తయారీదారు, బండారులంక, అమలాపురం మండలం
Comments
Please login to add a commentAdd a comment