కాటేసిన కరెంటు తీగ..
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
గుండెలవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు
ఓ రైతు తమ కూలీతో కలిసి మోటారు సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నాడు... కిందికి వాలి ఉన్న విద్యుత్ తీగలు తెగి ఆ రైతు గొంతుకు తగులుకున్నాయి... అంతే బైక్ అదుపు తప్పింది... వెనుక కూర్చున్న కూలీ ఎగిరి కింద పడ్డాడు... రైతు మంటల్లో కాలిపోయి దుర్మరణం చెందాడు... కూలీ గాయాలతో బయటపడ్డాడు... సంఘటన స్థలానికి పరుగున వచ్చిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు... ఈ సంఘటనకు కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు... బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని వలసపల్లికి చెందిన రైతు జంగ గంగాధర్‌రెడ్డి(50) సోమవారం కరెంటు తీగలు తగిలి దుర్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆయన తమ ఉమ్మడి పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. భార్య వసుందరమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. తనకు ఉన్న పొలంలో చీనీ మొక్కలు నాటి, వరి పంట సాగు చేశారు. రోజూ ఉదయాన్నే కూలీలను పిలుచుకొని వెళ్లి వ్యవసాయ పనులు చేయిస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం ట్రాక్టర్లో కూలీలను పిల్చుకొని పొలానికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని తన అన్న వెంకట్రామిరెడ్డితో చెప్పి.. మరో కూలి రామాంజనేయులుతో కలిసి టార్ సైకిల్‌పై బయలు దేరారు. రోజూ వెళ్లే దారిలోనే వారు వెళ్తున్నారు. పొలం దాటి వెళ్తుండగా కిందికి వాలి ఉన్న 11 కేవీ విద్యుత్ తీగ తెగి వచ్చి.. గంగాధర్‌రెడ్డి గొంతుకు తగులుకుంది. దీంతో బైక్ అదుపుతప్పింది. అంతే వెనుకు కూర్చొని ఉన్న రామాంజనేయులు ఎగిరి కింద పడ్డారు. ఆ క్షణంలోనే మంటలు వ్యాపించి గంగాధర్‌రెడ్డి కాలిపోయి అక్కడికి అక్కడే మృతి చెందాడు. స్కూటర్ కూడా కాలిపోయింది.
అన్న వచ్చి విద్యుత్ తీగ తొలగించినా...
కింద పడ్డ రామాంజనేయులు కేకలు వేసుకుంటూ పొలంలోకి పరుగు తీసి విషయాన్ని తెలిపారు. దీంతో పొలంలో ఉన్న అన్న వెంకట్రామిరెడ్డి పరుగు తీసుకుంటూ వచ్చి విద్యుత్ తీగను కర్రతో తొలగించారు. అప్పటికే గంగాధర్‌రెడ్డి చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గాయాల పాలైన రామాంజనేయులును చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. వెంకట్రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.