'ఆ తండ్రి' తీర్పు కరెక్టే
- ఆత్మరక్షణకే వల్లభరావు ప్రతిదాడి
- ప్రేమోన్మాది రాజు కేసులో ఏసీపీ వెల్లడి
- హత్యకేసును తొలగించనున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఓ ప్రేమోన్మాది దాడినుంచి తన కుమార్తెతో పాటు ఇతర కుటుంబీకులను రక్షించుకునేందుకే బాధితురాలు నీరజ తండ్రి వల్లభరావు నిందితుడు రాజుపై దాడి చేశాడని ఏసీపీ సంజీవరావు శనివారం వెల్లడించారు. ఈ దాడి ఘటన గత నెల 17న జరిగిన సంగతి విదితమే.
ఈ సంఘటనపై బాధితురాలి తల్లి తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఏసీపీ తెలిపారు. ఈ కేసులో వల్లభరావుపై 302 హత్యానేరం,మల్లేష్ అలియాస్ రాజుపై 307, 448, 449, 462, 354 డి సెక్షన్ల కింద కేసు పెట్టామన్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన రాజు చనిపోయాడనీ, మిగిలిన నిందితుడు వల్లభరావుపై దర్యాప్తు సాగించామన్నారు. ఆత్మరక్షణలో భాగంగానే వల్లభరావు రాజుపై దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగా చంపలేదని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వల్లభరావుపై ఉన్న హత్య కేసును త్వరలో తొలగిస్తామన్నారు.
మా నాన్నే లేకుంటే...
రాజు దాడిలో కత్తిపోట్లకు గురైన నీరజ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తండ్రి వల్లభరావు ధైర్యం చేసి ప్రతిదాడి చేయకుంటే తామెవ్వరమూ బతికేవారము కామని చెప్పింది. తన కుటుంబీలంతా మృత్యువాత పడి ఉండేవారమనీ తండ్రి తెగించి పోరాడి తమను కాపాడాడని తెలిపింది.