దేవెగౌడకు వాల్మీకి అవార్డు
దావణగెరె : మాజీ ప్రధాని దేవెగౌడకు బుధవారం నగరంలో రాజనహళ్లి వాల్మీకి గురుపీఠం నుంచి మొదటిసారిగా వాల్మీకి అవార్డు ప్రదానం చేశారు. జిల్లాలోని హరిహర తాలూకా రాజనహళ్లి వాల్మీకి గురుపీఠం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవెగౌడకు ఈ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ.. ఎస్టీ వర్గానికి జేడీఎస్ పార్టీ తరపున 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టికెట్లు కేటాయించి సామాజిక న్యాయం కాపాడామన్నారు.
సామాజిక న్యాయం కోసం పోరాడిన ఎల్జీ హావనూరుకు హావనూరే సాటి అని, మళ్లీ అలాంటి హావనూరు పుట్టబోరని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకి గురుపీఠం ప్రసన్నానందపురి స్వామి, కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి జీఎం సిద్దేశ్వర్, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ శామనూరు శివశంకరప్ప, బళ్లారి లోక్సభ సభ్యుడు బీ శ్రీరాములు, హరిహర ఎమ్మెల్యే శివశంకర్, శివమూర్తి నాయక్, వడ్నాళ్ రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు.