ఎస్టీ జాబితాలో చేర్చేదాకా ఉద్యమం
ఆత్మకూర్ : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ వాల్మీకి బోయ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చెల్లప్ప కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేశారు. ఏ కుల వృత్తిలేని వాల్మీకి బోయలు అన్నిరంగాల్లో వెనుకబడ్డారని, విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత స్థాయిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా వాల్మీకి భవన నిర్మాణం కోసం రెండెకరాలు కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని, రూ.200 కోట్ల సంక్షేమ నిధి కేటాయించాలన్నారు. ఈ విషయమై సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టే వాల్మీకి బోయల సత్యాగ్రహం కార్యక్రమానికి జిల్లాలోని వాల్మీకులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం నాయకులు ప్రకాష్, శ్రీను, రఘు, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.