దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
తూర్పుగోదావరి: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేమగిరి సెంటర్లో సైకిల్మీద రహదారిని దాటడానికి ప్రయత్నిస్తున్న యనమదల లక్ష్మణరావు(34) అనే వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తున్న డ్రైవర్, క్లీనర్లను ఢీకొట్టింది.
దీంతో వేమగిరికి చెందిన లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందగా.. లారీ డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.