కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల కలకలం
తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం వామకుంట్లలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన నగేశ్, వెంకట్రావమ్మ, రవిలు ఊరి పొలిమేరలో చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో 40మంది చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు పలు దఫాలుగా గ్రామ పెద్దలతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు. గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.