ఇటు తిప్పితే వయోలిన్... అటు తిప్పితే సితార!
కొన్నేళ్ల క్రితం నాటి మాట. మార్కెట్లోకి కొత్త ఫోన్ వచ్చిందంటే అందరికీ ఆసక్తే... ఏ కొత్త ఫీచర్లున్నాయో అని. కానీ ఇప్పుడా పరిస్థితి. లేదు. ఏ కొత్త ఫోన్‌ను చూసినా ఆండ్రాయిడ్, ఐఫోన్ ఓఎస్‌ల మయం అనిపిస్తుంది. అయితే ఒక్కటుంది... పక్క ఫోటోలో కనిపిస్తోందే... ఈ ఫోన్ రూటే సపరేటు! ఎలాగంటారా? ఇది ఫోన్ మాత్రమే కాదు... ఓ గిటార్... ఓ వయోలిన్... ఓ సితార్! ఇంకా... మీకు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పేరు తోస్తే అది! ఒక చిన్న ఫోన్ లాంటి పరికరం ఇన్ని పాత్రలు ఎలా పోషించగలదన్న సందేహం వద్దు. ఈ వామీ ఫోన్‌ను ఒక్కసారి అటు, ఇటు తిప్పి చూడండి.... దీని సత్తా ఏమిటన్నది తెలుస్తుంది.
స్క్రీన్‌పై ఉన్న నిలువు గీతల్ని ఒత్తి పట్టుకుని, ఫోన్‌ను మెలికలు తిప్పితే ఒక క్షణం వయోలిన్లా, ఇంకో క్షణం సితారలా మార్చేయవచ్చు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కారణంగా మీరు ఫోన్‌ను ఎలా, ఎంత కోణంలో ఎంత ఒత్తిడితో మెలితిప్పారన్న విషయాలను విశ్లేషించి దానికి అనుగుణమైన సౌండ్స్ వెలువడేలా చేస్తుంది. కింగ్స్టన్లోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు ఈ వామీ ఫోన్‌ని. సంగీతాన్ని పలికించడంతోపాటు ఈ ఫోన్ స్క్రీన్ 1920 బై 1080 ఓలెడ్ (ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్) స్క్రీన్‌తో వస్తుంది. ప్రస్తుతానికి ఇది ఒక డెమోఫోన్ మాత్రమే. మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకొంత టైమ్ పడుతుంది. అందుబాటులోకి వస్తే మాత్రం... బాత్రూమ్ మ్యూజిక్ లవర్స్ కూడా ఎంచక్కా కావాల్సిన చోట, కావాల్సిన సంగీతం సృష్టించుకోవచ్చు.