vamshikrishna
-
Jana Sena Clash: ‘దక్షిణ’ నాదంటే నాదే!
సాక్షి, విశాఖపట్నం: జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్ జరుగుతోంది. ఈ సీటును కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజులతో పాటు మూగి శ్రీనివాస్‌లు ఆది నుంచీ ఆశిస్తున్నారు. తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. జనసేన అభ్యర్థుల జాబితాల్లో విశాఖ దక్షిణ అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అయినా ఈ సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. వంశీ అభ్యర్థిత్వంపై దక్షిణం సీటును ఆశిస్తున్న ఈ ముగ్గురు నేతలూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. ‘వంశీ వద్దు.. స్థానికులే ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. కొద్దిరోజుల క్రితం ఒక మేకను తీసుకొచ్చి వంశీతో పోలుస్తూ ఈ సీటును బలి చేయొద్దని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో వంశీ వర్గీయులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జనసేన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో జనసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. వంశీ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేక వర్గీయులు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వంశీకృష్ణకు టికెట్ కేటాయింపు ప్రకటన వట్టిదేనని, అంతా బూటకమని కందుల బహిరంగంగానే చెబుతున్నారు. పవన్ ఆ సీటును తనకే ఖరారు చేస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మంగళగిరికి కందుల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ దక్షిణ సీటు తనకే కేటాయించాలని కోరేందుకు కందుల నాగరాజు గురువారం మంగళగిరికి పయనమయ్యారు. వంశీకృష్ణకు సీటిస్తే ఓడిపోతారని, తనకిస్తే గెలుస్తానని చెప్పడానికి వెళ్లారు. సీటు ఇస్తారన్న హామీతోనే గతంలో జనసేనలో చేరానని, ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి గుడ్‌బై చెబుతానని పవన్‌కు స్పష్టం చేయనున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంగళగిరి పంచాయతీలో దక్షిణ టికెట్‌పై ఏం తేలుస్తారోనని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇవి చదవండి: ‘సైకిల్’ దొంగ దొరికాడోచ్! -
వైద్యో నారాయణో హరి..
చైతన్యకృష్ణ హీరో పరిచయమవుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ అనేది ట్యాగ్‌లైన్. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాను డిసెంబరు 2న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మార్క్ కె.రాబిన్ సంగీతం అందించారు. -
వైఎస్సార్సీపీ నగర అధ్యక్షునిగా వంశీకృష్ణ శ్రీనివాస్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర శాఖ అధ్యక్షుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొం ది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వంశీకృష్ణ శ్రీనివాస్‌ను నగర అధ్యక్షుడిగా నియమించారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత కొన్నేళ్ల పాటు నగర అధ్యక్షుడిగా పనిచేసిన వంశీకృష్ణ గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాఖ పార్లమెంట్ జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బెహరా విశాఖ పార్లమెంట్ జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బెహరా భాస్కరరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. -
టెక్ మహీంద్రా ఉద్యోగి దుర్మరణం
నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ వద్ద హైవేపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్పోర్ట్సు బైక్ ఇంజన్ జామ్ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరు టెక్ మహీంద్రా ఉద్యోగస్తులు. కాగా హెల్మెట్ ఉన్నా బలంగా ఢీ కొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా వంశీకృష్ణది విజయవాడలోని కృష్ణలంక అని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
ఆండ్రాయిడ్ ఫోన్ కావాలని అలిగి అఘాయిత్యం
ధర్మవరం : తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినా... ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లేకుండా కళాశాలకు వెళితే స్నేహితుల ముందు పరువు పోతుందని ఓ బీటెక్ విద్యార్థి క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు స్థానిక దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న నాగమణి, రాధాకృష్ణ దంపతుల పెద్ద కుమారుడు వంశీకృష్ణ (21) అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువు తున్నాడు. ఇటీవల తన ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. మళ్లీ అలాంటి సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని..వారం రోజుల తర్వాత కొంటానని తండ్రి హామీ ఇచ్చాడు. తనకు ఫోన్ కొనిస్తేనే కళాశాలకు వెళతానని లేదంటే స్నేహితుల ముందు పరువు పోతుందని గత రెండు రోజుల నుంచి అలిగాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పదిగంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పట్టణమంతా వెతికినా జాడ కనిపించలేదు. నిన్న ఉదయం రేగాటిపల్లి సమీపాన రైల్వే ట్రాక్ పై వంశీ కృష్ణ విగతజీవుడై పడి ఉన్నట్లు సమాచారం తెలిసి వారు అక్కడకు చేరుకున్నారు. రైలు ఢీకొనటంతో వంశీకృష్ణ శరీరం రెండుగా తెగిపడింది. కుమారుడి క్షణికావేశం చివరకు తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది.