ఆండ్రాయిడ్ ఫోన్ కావాలని అలిగి అఘాయిత్యం
ధర్మవరం : తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసినా... ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ లేకుండా కళాశాలకు వెళితే స్నేహితుల ముందు పరువు పోతుందని ఓ బీటెక్ విద్యార్థి క్షణికావేశంలో ప్రాణం తీసుకున్నాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు స్థానిక దుర్గానగర్లో నివాసం ఉంటున్న నాగమణి, రాధాకృష్ణ దంపతుల పెద్ద కుమారుడు వంశీకృష్ణ (21) అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువు తున్నాడు. ఇటీవల తన ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు.
మళ్లీ అలాంటి సెల్ ఫోన్ కొనివ్వాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదని..వారం రోజుల తర్వాత కొంటానని తండ్రి హామీ ఇచ్చాడు. తనకు ఫోన్ కొనిస్తేనే కళాశాలకు వెళతానని లేదంటే స్నేహితుల ముందు పరువు పోతుందని గత రెండు రోజుల నుంచి అలిగాడు. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి పదిగంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పట్టణమంతా వెతికినా జాడ కనిపించలేదు. నిన్న ఉదయం రేగాటిపల్లి సమీపాన రైల్వే ట్రాక్ పై వంశీ కృష్ణ విగతజీవుడై పడి ఉన్నట్లు సమాచారం తెలిసి వారు అక్కడకు చేరుకున్నారు. రైలు ఢీకొనటంతో వంశీకృష్ణ శరీరం రెండుగా తెగిపడింది. కుమారుడి క్షణికావేశం చివరకు తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది.