అంతర్జిల్లా దొంగ అరెస్ట్
రూ.2.80 లక్షల వస్తువులు స్వాధీనం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మిత్రులు మాలకొండారెడ్డి, తిరుపతిస్వామి అలియాస్ వంశీ చెడు వ్యసనాలకు లోనై, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడి, వివిధ కేసుల్లో పట్టుబడి ఒంగోలు జైలుకు కూడా వెళ్లారు.
జనవరి 5వ తేదీన బెయిలుపై వచ్చిన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లా రేపల్లిలో పల్సర్ బైకును అదే నెల 13వ తేదీన చోరీ చేశారు. 16న తెనాలి టౌన్లో రూ.30 వేల నగదు, బంగారు చైను, ఉంగరాలు సెల్‌ఫోన్ దొంగిలించారు. 20న నరసరావు పేట బ్రహ్మంగారి గుడి వద్ద రూ.లక్ష విలువ చేసే యమహా ఎఫ్‌జెడ్ బైకు అపహరించారు. 23న డోన్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో హోండాషైన్ బైకు, ఎల్జీ టీవీ, సెల్‌ఫోన్, దొంగిలించారు. అక్కడినుండి పుట్టపర్తికి వచ్చి మండల పరిధిలోని పెడపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
25వ తేదీన కొత్తచెరువులో ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇద్దరూ మామిళ్లకుంట క్రాస్ లోని పెట్రోలు బంకు వీధిలో రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్న రూ.లక్ష విలువ చేసే బైకును దొంగిలించారు. దీన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న మాలకొండారెడ్డిని బుధవారం పెడపల్లిలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బైకు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతిస్వామి అలియాస్ వంశీ మరికొన్ని సామాన్లు అమ్ముకొని వచ్చే ప్రయత్నంలో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో సహకారం అందించిన హెడ్‌కానిస్టేబుళ్లు ధనుంజయ, శ్రీనివాస్, పీసీలు నాగేంద్ర, మారుతి, నరసింహలను సీఐ అభినందించారు.