నేడు హైదరాబాద్‌కు వంశీ మృతదేహం
హైదరాబాద్: విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అక్కడ దురాగతాలకు గురై ప్రాణాలు కోల్పోతుండటం బాధ కలిగిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి మామడాల వంశీ మృత్యువాత పడటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వంశీ మృత దేహాన్ని స్వస్థలం చేర్చడానికి సంబంధిత అధికారులతో సంప్రదింపులు చేసినట్లు పేర్కొన్నారు.
భారత కాలమానం ప్రకారం వంశీ మృతదేహం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తరలించారని శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటుందని చెప్పారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లాలోని వంశీ స్వస్థలానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి వంశీ మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
జాతి విద్వేష కోణం లేదు: విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: వంశీ హత్య వెనక జాతి విద్వేష కోణమేమీ లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వంశీ మృతదేహాన్ని భారత్‌కు తెచ్చి తల్లిదం డ్రులకు అప్పగించేందుకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోందని ఆయన చెప్పారు.