కార్మికుల వైద్యానికి పెద్దపీట
► అవినీతి నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది
► కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో కార్మికుల వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడిం చారు. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని శనివారం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలో నిర్వహించిన సింపోజియా నికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. అవినీతి నిర్మూలనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్కామ్‌లు అనే మాటలకు తావులేని విధంగా కేంద్రంలో పరిపాలన సాగుతుందని తెలిపారు. అవినీతిని ఎంత మాత్రం ఉపేక్షించరాదనేది ప్రభుత్వ విధానమన్నారు. ఏ ప్రభుత్వమైనా, సంస్థలైనా అవినీతికి దూరంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు.
ఈఎస్‌ఐసీలో ఆన్ లైన్ లో ఆరోగ్య రికార్డులు
గత రెండున్నరేళ్ల కాలంలో కార్మిక శాఖలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా ఎవరైనా ఉద్యోగులు పదవీ విరమణ చేశాక వారికి సంబంధించిన సెటిల్‌మెంట్లకు గతంలో నెలరోజుల సమయం పట్టేదని... తమ ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే పూర్తి సెటిల్‌మెంట్ చేసేవిధంగా విధి విధానాలు రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 6 నుండి 10 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని వివరించారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐసీని దేశంలోనే అత్యుత్తమ వైద్య బోధనాసుపత్రిగా రూపొందించాలని... ఇందుకోసం ఉద్యోగులు అంకితభావంతో రోగులకు వైద్య సేవలు అందించడంతోపాటు జవాబుదారితనంతో పనిచేయాలని సూచించారు.
ఈఎస్‌ఐసీలో అందరి ఆరోగ్య రికార్డులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. దీనివల్ల ఎవరికివారు తమ రికార్డులను పరిశీలించుకోవడానికి వీలుంటుందని... ఆరోగ్య రికార్డులను పరిశీలించడం ద్వారా వైద్యులకు కూడా రోగులకు అత్యుత్తమమైన వైద్యం అందించడానికి దోహదపడుతుం దన్నారు. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓపీ సేవలు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈఎస్‌ఐసీలో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు ఆన్ లైన్ లోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆధార్ అనుసంధానిత హాజరు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి, కళాశాలలో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించడంలేదని కాంట్రాక్టు కార్మికులు కేంద్రమంత్రి దత్తాత్రేయకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వినయ్ సహస్ర బుద్దే, ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, కళాశాల డీన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.