మంత్రి గారి సుపుత్రుడి కండకావరం
టోల్ గేట్ రుసుం చెల్లించాలని స్నేహితులతో కలసి కారులో వెళ్తున్న మంత్రి గారి కుమారుడిని చెక్‌పోస్ట్ సిబ్బంది కోరారు. అంతే ఆ మంత్రిగారి పుత్రరత్నం అగ్గిమీద గుగ్గిలమైయ్యారు. తన ప్రతాపాన్ని ఆ టోల్ గేట్ సిబ్బందిపై ప్రదర్శించాడు. అంతేకాకుండా ఆ టోల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. దాంతో టోల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మంత్రిగారి కుమారుడిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించిన సంఘటన మంగళవారం గోవాలో చోటు చేసుకుంది.
గోవా పోలీసుల కథనం ప్రకారం.... మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణె కుమారుడు నితీష్ రాణెను తన స్నేహితులతో కలసి గోవా పయనమైయ్యాడు. ఆ క్రమంలో గోవా సమీపంలో టోల్గెట్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనానికి ట్యాక్స్ చెల్లించాలని కోరారు. దాంతో నితీష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.దాంతో టోల్ సిబ్బందిపై దాడి చేశారు. అతడి స్నేహితులు కూడా తామేమి తక్కువ తినలేదని కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి మంత్రిగారి సుపుత్రుడితోపాటు మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని ప్రినం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నితీష్ ,అతడి స్నేహితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంత్రి గారి పుత్రరత్నం అరెస్ట్ వార్త తెలియడంతో ఆయన అనుచరులు ప్రినం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. నితీష్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నితీష్ తోపాటు అతడి స్నేహితులను మరో పోలీసు స్టేషన్‌కు తరలించారు. గోవా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.