Vankayala Satyanarayanamurti
-
విశాఖ మదిలో ‘మావిచిగురు మాస్టారు’
మావిచిగురు తినగానే..కోయిల పలికేనా.. మావిచిగురు తినగానే..కోయిల పలికేనా.. కోయిల గొంతు వినగానేమావి చిగురు తొడిగేనా.. కోయిల గొంతు వినగానేమావి చిగురు తొడిగేనా.. ఈ పాట 1978లో వచ్చిన సీతామాలక్ష్మి చిత్రంలోనిది..ఈ పాటను..ఈ పాటలో సంగీత మాస్టర్‌గా అభినయించిన వంకాయల సత్యనారాయణ మూర్తిని సినీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఉగాది సందర్భంగా తెలుగునోట ఈ పాట ప్రతిధ్వనించాల్సిందే. అంతటి విశిష్టత కలిగిన ఈ గీతంలో ముఖ్యభూమిక పోషించిన వంకాయల సత్యనారాయణ సరిగ్గా మావిచిగురు తొడిగి కోయల పాట పాడే రోజుల్లోనే అనంతలోకాలకు చేరడం యాదృచ్ఛికమో! దైవ సంకల్పమో! సరిగ్గా ఉగాదికి వారం రోజులు ముందు ఆయన దైవసన్నిధికి చేరుకున్నారు. విశాఖ కల్చరల్: సహజ నటనకు వంకాయల సత్యనారాయణ పెట్టింది పేరు. ఏ క్యారక్టర్‌లోనైనా ఇమిడిపోతారు. అతని వాక్ఛాతుర్యం కూడా అద్భుతం. 250 చిత్రాలో నటించి మెప్పించారు. ఆ వెండితెర ముద్దు బిడ్డ పుట్టింది సాగరతీరాన్నే. విశాఖ గడ్డపై అగ్రశ్రేణి వ్యాపార కటుంబంలో పుట్టారు. నటనను ఆరో ప్రాణంగా భావించారు. నాటక రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఏడేళ్ల నుంచి విశాఖలోనే స్థిరపడి సాత్విక కార్యక్రమాల్లో పాల్గొంటూ కళామతల్లి సేవలోనే కొనసాగారు. ఇలాంటి సీనియర్ నటుడు ఇక లేరు అనే విషయాన్ని విశాఖ కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటనే ఊపిరిగా.. వంకాయల కుటుంబం చాలా పెద్దది. ఆరుగురు అన్నదమ్ముళ్లు, నలుగురు అక్కచెల్లెళ్లు. 1940 డిసెంబరు 28న విశాఖ చావల వారివీధిలో రెండో సంతానంగా జన్మించిన వంకాయల ఏవీఎన్ కాలేజీలో విద్యనభ్యసిస్తూ, నాటకరంగంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం సినిమాలే కాదు వంకాయల బహుముఖ ప్రతిభాశాలి. బీకామ్‌లో ఆయన గోల్డ్ మెడలిస్టు. క్రీడల్లోనూ ప్రతిభ చాటుకున్నారు. 1960 ఎన్సీసీ రైఫిల్ షూటింగ్లో అంతర్జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం పొందారు. విద్యార్థి దశలోనే నాటకరంగంపై ఉన్న మక్కువతో నాటక కళాపరిషత్తులో చేరి రంగస్థల నటుడుగా రాణించారు. చదువు, ఆటల్లో ప్రతిభ కారణంగా హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో మంచి ఉద్యోగం వచ్చినప్పటికీ నటన అంటే ఇష్టంతో సినిమా రంగం వైపు అడుగులేశారు. 1976లో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించారు. 250 తెలుగు చిత్రాల్లో నటించారు. 184 చిత్రాలు గొప్ప పాత్రల్లో మెప్పించడం సామాన్య విషయం కాదు. 1976 నుంచి 2000 వరకు చెన్నైలోనే ఉండేవారు. 2001లో మళ్లీ విశాఖనగరానికి వచ్చి గవర్నర్ బంగళా ఎదురుగా గల సీషెల్స్ ఎన్‌క్లేవ్‌లో వారి రెండో అమ్మాయి లావణ్య దగ్గర ఉంటున్నారు. సత్యనారాయణకు భార్య శకుంతల, పెద్ద కుమార్తె సుభద్రదేవి, రెండో కుమార్తె లావణ్య, ఇద్దరు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు, ఒక మునిమనవరాలు ఉన్నారు. ప్రేక్షకుల మదిలో.. రంగస్థలం, వెండితెర, బుల్లితెరలపై ఆయన నటనా విశ్వరూపం చూపించారు. ఎన్నో హావభావాలు పలికించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సంభాషణల్లో ఏదో తెలియని మాధుర్యం ఉంటుంది. పూర్తిగా బేస్ వాయిస్. నీడలేని ఆడది, సినిమాతో ఆరగేంట్రం చేశారు. అప్పట్లో సినీ పరిశ్రమ మద్రాస్‌లో ఉండటంతో వైజాగ్ నుంచి చెన్నైకు మకాం మార్చేశారు. తొలి..ఆఖరి శ్వాస సాగరతీరంలోనే.. మద్రాసులో ఉన్న వంకాయల సత్యనారాయణకు పుట్టిన ఊరంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన మనసు మళ్లీ విశాఖవైపు మళ్లింది. ఏడేళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఎప్పటిలాగే నగరంలో కళాకారులను ప్రోత్సహిస్తూ పలు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. తోటి కళాకారుల్లో నూతనుత్తేజాన్ని కలిగించారు. నగరానికి చెందిన ఎందరో కళాకారులకు సినీ రంగానికి కూడా పరిచయం చేశారు. ఇటీవల గుణనిధి పేరిట కళాభారతిలో గొప్ప నాటిక ప్రదర్శించారు. -
అత్యుత్సాహం : మరో నటుణ్ని చంపేశారు..!
ఇటీవల సోషల్ మీడియాలో కొంత మంది చూపిస్తున్న అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఏదైన వార్త వచ్చిన సందర్భంలో పూర్తిగా అవగాహన లేకుండా.. జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టడం వెంటనే అవి వైరల్ అవ్వటం జరిగిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. సోమవారం సీనియర్ నటుడు వంకాయల సత్యనారాయణ మూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన మరణ వార్త మీడియాలో రావటంతో కొందరు వంకాయల సత్యనారాయణ మూర్తికి బదులుగా కైకాల సత్యనారాయణ మరణించినట్టుగా సోషల్ మీడియలో సంతాప సందేశాలను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లను మరికొందరు షేర్ చేయటంతో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కైకాల సత్యనారాయణగారు క్షేమంగా ఉన్నారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. -
వంకాయల సత్యనారాయణమూర్తి ఇక లేరు
ప్రముఖ సినీ, రంగస్థల సీనియర్ నటుడు, దర్శకుడు వంకాయల సత్యనారాయణ (78) ఇక లేరు. నటుడిగా సుమారు నాలుగు దశాబ్దాలపాటు వెండితెరపై విభిన్న పాత్రల్ని పండించిన ఆయన సోమవారం తన నివాసంలో మృతి చెందారు. కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ విశాఖలోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. 1940లో విశాఖపట్నం చవలవారి వీధిలో సత్యనారాయణ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అనారోగ్యంతో బాధపడుతూ కుమార్తె ఇంట్లోనే ఉంటున్నారు. నెల క్రితం కళాభారతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ఒక నాటకంలో ముఖ్యపాత్ర పోషించి మెప్పించారు. నడవలేని స్థితిల్లో ఉన్నా నాటకాలంటే ఆయనకు ఎంతో మక్కువ. నాటక రంగం నుంచే ‘నీడలేని ఆడది’ సినిమాతో చిత్ర రంగప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస కల్యాణం, శుభలేఖ, దొంగకోళ్లు, విజేత వంటి చిత్రాలతోపాటు 160కిపైగా చిత్రాల్లో, పలు సీరియల్స్‌లో నటించారు. వందలాది రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారు. -
దిక్కులేని స్థితిలో సినీ పరిశ్రమ
ప్రముఖ సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మావిచిగురు తినగానే కోయిల పలికేనా.. అంటూ ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టార్‌గా పాట పాడిన వ్యక్తి మీకు గుర్తున్నారా.. ఆయనే ఈయన. పేరు వంకాయల సత్యనారాయణమూర్తి. దేశోద్ధారకుడు, జానకిరాముడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. ప్రస్తుతం కౌతవరంలో జరుగుతున్న ‘ఈ నేల- ఈ గాలి’ సీరియల్ షూటింగ్ పాల్గొనేందుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న సినీ పరిశ్రమలో నటులు, సాంకేతిక నిపుణులు తెలంగాణ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయన శనివారం ‘సాక్షి’కి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ దిక్కులేని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) ప్రశ్న : ‘సీతామహాలక్ష్మి’ సినిమా మీకు మంచి పేరేతెచ్చినట్టుంది? జవాబు : 1978లో ‘సీతామహాలక్ష్మి’ సినిమాలో స్టేషన్ మాస్టారుగా నటించాను. 36ఏళ్లు గడుస్తున్నా నన్నింకా అందరూ సీతామహాలక్ష్మి స్టేషన్ మాస్టారుగానే పలకరిస్తారు. ప్రశ్న : ఇప్పటివరకు ఎన్ని సినిమాలు, సీరియల్స్‌లో నటించారు? జవాబు : తెలుగులో 174, తమిళంలో మూడు, హిందీలో మూడు సినిమాల్లో నటించాను. అలాగే, తెలుగులో 50, తమిళంలో 12 సీరియల్స్ చేశాను. ప్రశ్న : ఆంధ్రా నటులపై తెలంగాణ సర్కార్ వివక్ష చూపుతోందంటున్నారు. కారణం? జవాబు : కేవలం నటులే కాదు. ఆంధ్రావాళ్లంటేనే తెలంగాణ ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ప్రశ్న : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది? జవాబు : దిక్కులేక అద్దె కొంపలో తెలుగు పరిశ్రమను బతికించుకునేంతగా ఉంది. ప్రశ్న : కొత్త ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ వస్తుందంటారా.. జవాబు : తెలంగాణలోని ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి పరిశ్రమను ఆంధ్రాకు తరలిద్దామని సినీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. కానీ రావటానికి అవసరమైన వనరుల్ని కల్పించాలి. ప్రశ్న : ఎప్పటికి అది సాధ్యమవుతుంది? జవాబు : రాత్రికిరాత్రి పరిశ్రమను మార్చేయటం కుదరదు. నెమ్మదిగా ఆంధ్రాలోకి తీసుకురావాలి. కోట్లాది సినీ ప్రముఖుల ఆస్తులు తెలంగాణ పాలయ్యాయి. ప్రశ్న : ఆంధ్రాలో పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి? జవాబు : సింగిల్ విండో పద్ధతిని అనుసరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.