వైభవంగా వరలక్ష్మి వ్రతాలు
హన్మకొండ కల్చరల్ : శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయా ల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో మహిళలు అమ్మవారికి ఒడిబాలబియ్యం, చీరలు సమర్పిం చుకున్నారు. అలాగే కుంకుమ పూజలు నిర్వహించారు. తొలుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, తదితరులు పాల్గొన్నారు.
రాజరాజేశ్వరీ ఆలయంలో..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో అర్చకుడు రాజు, అమ్మవారి ఉపాసకులు యల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పూజలు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.