Varanasi central jail
-
భగవద్గీత తీసుకెళ్లిన పాక్ ఖైదీ
వారణాసి: భారత జైల్లో నుంచి విడుదలైన ఓ పాకిస్తాన్ జాతీయుడు చేసిన పని భారత సంస్కృతి గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పింది. పాకిస్తాన్‌కు చెందిన జలాలుద్దీన్ 16 ఏళ్లుగా వారణాసి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించాడు. ఆదివారం రోజున జైలు నుంచి విడుదలైన జలాలుద్దీన్ తిరిగి స్వదేశానికి వెళ్తూ.. తన వెంట పవిత్ర గ్రంథం భగవద్గీతను తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన జలాలుద్దీన్ వద్ద అనుమానాస్పద పత్రాలు లభించడంతో 2001లో వారణాసి కంటోన్మెంట్ ప్రాంతంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వారణాసి కంటోన్మెంట్ మ్యాప్‌తోపాటు, ఇతర కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత న్యాయస్థానం అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జలాలుద్దీన్ జైల్లోకి వచ్చినప్పుడు.. అక్కడ ఉన్నవారిలో అతనొక్కడే హైస్కూల్ విద్యను పూర్తి చేశాడు. జైల్లో ఉంటూనే అతను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. ఎలక్ట్రీషియన్ కోర్సు కూడా నేర్చుకున్నాడు. గత మూడేళ్లుగా జైల్లో జరిగిన క్రికెట్ పోటీలకు అంపైర్‌గా ఉన్నాడు. కాగా, జలాలుద్దీన్ను వారణాసి జైల్లో నుంచి తీసుకువెళ్లిన ప్రత్యేక బృందం అట్టారి-వాఘా బార్డర్ వద్ద పాక్ అధికారులకు అతన్ని అప్పగించనుంది. 16 ఏళ్లలో జలాలుద్దీన్ ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చినట్టు జైలు అధికారులు తెలిపారు. -
ఇగ్నో నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఖైదీ
న్యూఢిల్లీ: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అన్న చందంగా పదేళ్ల జైలు శిక్ష పడిన ఓ ఖైదీ.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి బంగారు పతకం సాధించాడు. వారణాసి సెంట్రల్ జైల్లో 2012 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభవిస్తున్న అజిత్ కుమార్ సరోజ్ (23) అనే ఖైదీ ఇగ్నో నిర్వహించిన పర్యాటక విద్యా డిప్లొమాలో ప్రథమస్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో అజిత్‌కు పసిడి పతకాన్ని బహూకరించారు. ఇదే కాకుండా అజిత్ శిక్షాకాలంలో మానవ హక్కులు, విపత్తు నిర్వహణ, ఎన్జీవో మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేశాడు. వీటిలో దాదాపు 65 శాతం పైన మార్కులు తెచ్చుకున్నాడని అధ్యాపకులు అభినందించారు. ఇగ్నోకు సంబంధించి వారణాసి రీజియన్‌లో ఉన్న 20 జిల్లాల్లోని ఆరువేల మంది విద్యార్థుల్లో అజిత్‌కు మాత్రమే గోల్డ్ మెడల్ దక్కడం విశేషమని ప్రశంసించారు.