మోదీ నియోజకవర్గంలో విద్యాసంస్థలు బంద్
లక్నో: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహిస్తోన్న నియోజకవర్గం వారణాసిలో ఏర్పడిన ఘర్షణ వాతావరణ ప్రభావం అక్కడి పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలపై తీవ్రంగా పడింది. రెండో రోజు కూడా అవి తెరుచుకోలేదు. ఎప్పుడు ఎటునుంచి ఘర్షణ మొదలవుతుందో, రాళ్లు పడతాయో, తుపాకీ పేలుతుందో తెలియని ఆందోళనతో ఆయా సంస్థల యాజమాన్యాలు వాటిని తెరవలేదు.
వారణాసిలో హిందూత్వ ప్రతినిధులు, పోలీసులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హిందూత్వ సంస్థల ప్రతినిధులపై సెప్టెంబర్ 22న జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ సోమవారం ఉదయం నిర్వహించిన ర్యాలీ.. చివరికి హింసాయుతంగా మారడంతోపాటు పోలీసు బలగాలపై రాళ్లదాడికి ఆందోళనకారులు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు నిప్పుపెట్టారు. కొద్ది నిమిషాల్లోనే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకాయి. దీంతో కర్ఫ్యూ కూడా విధించారు. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుండటంతో మంగళవారం కూడా వారణాసిలో అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. గణేశ్ విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేసే విషయంలో ప్రభుత్వాధికారులకు, మండపాల నిర్వాహకులకు మధ్య తలెత్తిన విబేధాలే ప్రస్తుత అల్లర్లకు మూల కారణం.