వచ్చే నెలలో ‘అవును.. నేనే’ విడుదల
చిత్ర నిర్మాత వరసాల వెల్లడి
ఉప్పలగుప్తం : రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ‘అవును.. నేనే’ చిత్రాన్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని నిర్మాత వరసాల సత్యనారాయణ తెలిపారు. మండలంలోని చల్లపల్లి గ్రామానికి చెందిన ఆయన తొలి ప్రయత్నంలోనే చిత్ర నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన గురువారం విలేకర్లతో ముచ్చటించారు. వరసాల సరస్వతీ నరసింహరావు సమర్పణలో కళింగ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై గూన అప్పారావు దర్శకత్వంలో ‘అవును.. నేనే’ చిత్రం నిర్మించామన్నారు. ఊహలు గుసగుసలాడే, సూర్య వర్సెస్ సూర్య ఫేమ్ శ్రీమన్మథ హీరోగా రాజీ హీరోయిన్గా పూర్తి రొమాంటిక్ హారర్ చిత్రంగా దీనిని రూపొందించామన్నారు.
ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకుని మొదటి కాపీని సెన్సార్‌కు పంపించామని తెలిపారు. శ్మశానాల్లో లేని దెయ్యాలు కోరికలతో రగిలిపోతున్న మనుషుల దేహాల్లో ఉంటాయన్న కథాంశంతో దర్శకుడు అప్పారావు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారన్నారు. చిత్ర విజయంపై పూర్తి ధీమా ఉందని వరసాల చెప్పారు. రాజకీయాల్లో తిరిగే తనకు దర్శకుడు గూన అప్పారావు అనుకోకుండా తారసపడ్డారని, ఆయనతో పరిచయం పెరిగి చిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టానని అన్నారు. చిత్ర కథనుబట్టి అనుకున్న బడ్జెట్‌కంటే అదనంగా ఖర్చు చేశామని, ఇప్పటికే చిత్ర హక్కుల కోసం చాలామంది ముందుకు వచ్చారని అన్నారు. మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో రెండో చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని, ఇందుకు గ్రామీణ నేపథ్యం ఉన్న కథను సిద్ధం చేశామని వరసాల తెలిపారు.
సన్నివేశాల చిత్రీకరణకు ఇప్పటికే మండలంలో పలు ప్రదేశాలను ఎంపిక చేశామన్నారు. సినిమా చిత్రీకరణకు కోనసీమ ప్రాంతం చాలా అనువుగా ఉన్నందున పెద్ద నిర్మాతలు సైతం ఇక్కడకు తరలిరావడం శుభ పరిణామమని, రానున్న రోజుల్లో కోనసీమకు చిత్ర పరిశ్రమ తరలివచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో బాగా స్థిరపడినవారు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు. తద్వారా ఇక్కడివారికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందన్నారు. వర్థమాన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో తమ నిర్మాణ సంస్థ ముందుంటుందని వరసాల చెప్పారు.