నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు.. ఆదివాసీలకు ఆహ్వానం
చర్ల/దుమ్ముగూడెం: మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఏజెన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ వాల్‌పోస్లర్లు, కరపత్రాలు, లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఆదివాసీలకు ఆహ్వానం..
వారోత్సవాలకు హాజరు కావాలని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లో గల ఆదివాసీ ముఖ్యులను మావోయిస్టులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఏ గ్రామం నుంచి ఎవరు వెళతారనే సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.