Varun Motors
-
సీఎం సహాయనిధికి వరుణ్ గ్రూప్ విరాళం
సాక్షి, అమరావతి : కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు విరాళాలు అందచేశాయి. తాజాగా వరుణ్ గ్రూప్ గురువారం సీఎం సహాయనిధికి రూ.2కోట్లు విరాళం ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిషోర్, ఎండీ వి.వరుణ్ దేవ్ ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందచేశారు. ►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలు తరపున 1 కోటి 18 వేల 227 రూపాయలు విరాళమందించారు. ►నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను కలిసి విరాళానికి సంబంధించిన చెక్ అందజేశారు.మెట్టిపల్లి రమేష్,దానారెడ్డి, ఎం.బి.వి.సత్యన్నారాయణ పాల్గొన్నారు. ►సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సీఈఓ వెంకట్ జాస్తి విరాళం చెక్‌ను అందజేశారు. ►విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం ►గుంటూరు రోమన్ కేథలిక్ డయోసిస్ : రూ.25 లక్షలు విరాళం ►దొడ్ల డెయిరీ : రూ.25 లక్షలు విరాళం. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును వైయస్.జగన్‌కు దొడ్ల డెయిరీ తరపున పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. -
బండి.. జోరు తగ్గిందండి!
సాక్షి, అమరావతి: ఆర్థిక మందగమనంతో దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు భారీగా పడిపోయినా రాష్ట్రంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద వాహనాల విక్రయాలు తగ్గడంతో ఆ ప్రభావం రవాణా రంగం రాబడిపై పడింది. తొలి అర్థ సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రవాణా రంగం ఆదాయం భారీగా తగ్గింది. తొలి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్)లో సమకూరిన రాబడి గత ఏడాదితో పోల్చి చూస్తే 11.81 శాతం మేర తగ్గింది. రెండో త్రైమాసికం (జూలై – సెప్టెంబర్)లో రాబడి గత ఏడాదితో పోలిస్తే 12.42 శాతం తగ్గింది. అక్టోబర్‌లో కొంత పుంజుకున్నా గత ఏడాదితో పోల్చి చూస్తే మాత్రం 6.83 శాతం తగ్గింది. ‘వాహనమిత్ర’తో జోరుగా ఆటోల విక్రయాలు! ఆర్థిక మాంద్యంలోనూ రాష్ట్రంలో ఆటోల విక్రయాలు పెరగడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విక్రయాలను పోల్చి చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో ఆటోల అమ్మకాలు 19.32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 6.37 శాతం మేర తగ్గాయి. సొంతంగా ఆటో నడుపుకొనే వారికి ఏటా రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకం ద్వారా ఆర్థ్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. స్వయం ఉపాధి కోసం రాష్ట్రంలో పేద, దిగువ మధ్య తరగతి వారు ఎక్కువ మంది ఆటోలను కొనుగోలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మందగమనమే కారణం గత ఆరేడు నెలలుగా ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం ఆర్థిక మంద గమనమే. దేశవ్యాప్తంగా పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈసారి అక్టోబర్‌లో పండగ సీజన్లో కూడా కార్ల అమ్మకాలు పెరగలేదు. డిసెంబర్లో కూడా పరిస్థితి ఇలాగే ఉండవచ్చని భావిస్తున్నాం. ఇక ఆశలన్నీ కొత్త ఏడాదిపైనే. ఆటోల విక్రయాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒక వలయం మాదిరిగా ఉంటాయి. మావద్ద బజాజ్ ఆటోల విక్రయాలు వంద శాతం పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తుండటం కూడా విక్రయాలు పెరగడానికి కారణం. డౌన్ పేమెంట్ కింద రూ.25 వేలు చెల్లించాల్సి ఉండగా వాహన మిత్ర ద్వారా ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుండటంతో స్వయం ఉపాధి కోసం ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు – సత్యనారాయణ (డైరెక్టర్, వరుణ్ మోటార్స్) -
బెస్ట్ డీలర్ గా వరుణ్ మోటార్స్
♦ మారుతి సుజుకి ప్రతిష్టాత్మక అవార్డు ♦ వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఏటా ఇచ్చే ఆల్ ఇండియా బెస్ట్ పెర్ఫార్మెన్స్ డీలర్ అవార్డు వరుణ్ మోటార్స్‌కు వరిం చింది. దేశవ్యాప్తంగా 450 మంది డీలర్లు పోటీపడగా వరుణ్ మోటార్స్ విజేతగా నిలిచింది. విక్రయాలు, సేవలు, ఫైనాన్స్, యాక్సెసరీస్, ట్రూ వాల్యూ షో రూంలు, డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణ తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డీలర్‌కు ఈ అవార్డు ఇస్తారని వరుణ్ మోటార్స్ ఎండీ వి.వరుణ్ దేవ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2015-16లో మొత్తం ఏడు అవార్డులను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. భారత్‌లో ఈ ఏడాది మారుతి సుజుకి టాప్-4 డీలర్‌గా నిలవడమే లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ మోటార్స్ టాప్-5 డీలర్‌గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 27,000 కార్లను విక్రయించింది. మారుతి సుజుకి అమ్మకాల్లో వరుణ్ మోటార్స్ వాటా 2.2 శాతం. భారీగా వ్యాపార విస్తరణ..: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వరుణ్ గ్రూప్ ఇటీవలే బెంగళూరులో మారుతి షోరూంతో అడుగు పెట్టింది. త్వరలో మరో షోరూంతోపాటు నెక్సా ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 7 రూరల్ ఔట్లెట్లను తెరుస్తోంది. 2016-17లో 31,000 కార్ల విక్రయం లక్ష్యమని వరుణ్ దేవ్ వెల్లడించారు. వరుణ్ మోటార్స్ విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతమని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంపెనీలవి నెలకు 11,500 కార్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో మారుతి సుజుకి వాటా 5,000 యూనిట్లు. వరుణ్ మోటార్స్ గ్రూప్ విస్తరణకుగాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.160 కోట్లు వెచ్చిస్తోంది. విశాఖపట్నం జిల్లా భీమిలి వద్ద రూ.25 కోట్లతో నిర్మిస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్లు నెల రోజుల్లో సిద్ధం కానున్నాయి. అలాగే విజయవాడలో రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న 268 గదుల స్టార్ హోటల్ 2018లో ప్రారంభం కానుంది. కాగా, మీడియా సమావేశంలో వరుణ్ మోటార్స్ గ్రూప్ ఈడీ వి.ఆర్.సి.రాజు, డెరైక్టర్ డి.కె.రాజు, జీఎం నీరజ్ పాల్గొన్నారు.