రాజీ పడక.. ఒత్తిళ్లకు బెదరక
కర్నూలు: రాజకీయ ఒత్తిళ్లకు బెదరకుండా.. అధికార పార్టీ నాయకులతో రాజీపడకుండా ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లాలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన శాఖా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పోలీస్ శాఖ పనితీరును గాడిలో పెట్టారు. జిల్లా కేంద్రానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడే ప్రజానీకం కోసం మీతో మీఎస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుద్యోగులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి కూరుకుపోకుండా ఉద్యోగాలు కల్పించేందుకు చొరవ చూపారు.
ఆదోని, కోసిగి, కర్నూలు టౌన్‌కు చెందిన యువకులకు 600 మందికి శిక్షణనిచ్చి కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు ఆదోనిలో పేరు మోసిన మట్కా కింగ్. ఈయన ఆస్తుల విషయంలో విచారణ జరిపించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి లేఖ రాసి సంచలనం సృష్టించారు.
ఆమ్వే కంపెనీకి చెందిన సీఈఓ విలియం స్కాట్ పింకినేను ఢిల్లీలోని గూర్గావ్లో అరెస్టు చేశారు. జిల్లాలో సంచలనం రేపిన నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారం మొదలుకొని కర్నూలు-నంద్యాల జంట హత్యలను ఛేదించారు. మాల్‌ప్రాక్టీస్ ముఠా గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేయించడంలో శాస్త్రీయ పద్ధతులను పాటించి ఫలితాలు సాధించారు. వసంత గోల్డ్, అక్షయ గోల్డ్, అవని గోల్డ్ సంస్థలకు సంబంధించి డిపాజిటర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టుబడుల చట్టాన్ని ఉపయోగించి వాటి నిర్వాహకులను కటకటాలకు పంపారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అరెస్టు చేశారు.
ఏడాది క్రితం ఎస్పీగా జిల్లాకు వచ్చిన ఆయన నేతల ఒత్తిళ్ల మధ్యనే విధులు నిర్వహించారు. బాధ్యతలు చేపట్టిన మూడున్నర నెలలకే హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా ఆయనను బదిలీ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగేలా ఉత్తర్వులు పొంది సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం ఈయన బదిలీ వెనుక జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వద్ద పంచాయితీ పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.