ఎర్రస్మగ్లర్లపై పిడికిలి
ఆరుగురిపై పీడీ యాక్టు
ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్ సిద్ధ్దార్థజైన్
చిత్తూరు (అర్బన్): జిల్లాలో పేరొందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లపై ఎట్టకేటలకు ‘పిడి’కిలి బిగించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు రా జకీయ అండదండలు ఉన్నాయనే నేపథ్యంలో ‘సాక్షి’లో ఈనెల 11న ‘రాజకీయ పిడికిలి’ పేరిట వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. పలువురు ఎర్ర స్మగ్లర్లపై చిత్తూరు, తిరుపతి ఎస్పీలు పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్‌కు 20 రోజుల క్రితం ఫైలు పంపడం, ఇప్పటివరకు అవి పెండింగ్‌లో ఉండడంపై సాక్షిలో సవిరంగా వార్తా కథనం ప్రచురితమయ్యింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సిద్ధ్దార్థజైన్ ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టుకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
వీరిపై పీడీ యాక్టు
పీడీ యాక్టు నమోదుకు అనుమతిచ్చిన వారిలో చంద్రగిరి మండలం ఎ.రంగంపేట గ్రామానికి చెందిన దొడ్డికాళ్ల కృష్ణారెడ్డి అలియాస్ రంగారెడ్డి కృష్ణారెడ్డి అలియాస్ మునికృష్ణారెడ్డి (44) ఉన్నాడు. ఇతను 2009లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడ్డాడు. దాని తరువాత ఆరుసార్లు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతనిపై మొత్తం 7 కేసులు నమోదు కాగా,ఇందులో అటవీశాఖకు చెందిన ఒక కేసు, మిగిలినవి పోలీసులు కేసులు. గతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారుల్ని కొట్టి చంపిన కేసుల్లో సైతం ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతను ప్రస్తుతం తిరుపతి సబ్‌జైలులో ఉండగా, పీడీ యాక్టు నమోదుకు తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి కలెక్టర్‌కు ఫైలు పంపారు. ఈ మేరకు ఇతనిపై పీడీ యాక్టుకు అనుమతి ఇచ్చారు.
చిత్తూరు నగరం సాయినగర్ కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సీ.వసంతకుమార్ అలియాస్ వసంత్‌పై కూడా పీడీ యాక్టుకు అనుమతి ఇచ్చారు. ఇతనిపై భారకాపేట, పలమనేరు, చిత్తూరు వన్‌టౌన్, పీలేరు తదితర పోలీసు స్టేషన్లలో ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలుమార్లు జిల్లా పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పీడీ యాక్టు నుంచి తప్పించుకోవడానికి ఏకంగా రాష్ట్ర మంత్రి నుంచి కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చారు.
అయితే ‘సాక్షి’లో దీనిపై వరుస కథనాలు రావడంతో పీడీ యాక్టు నుంచి వసంత్‌ను మినహాయించడానికి అధికారపార్టీ నేతలు, అధికారులు వెనుకడుగు వేశారు. ఇతనితో పాటు చిత్తూరు నగరం న్యూబాలాజీ కాలనీకి చెందిన ఎం.విజయకుమార్ అలియాస్ కుళ్లకుమార్, వైఎస్ఆర్ జిల్లా రామాపురానికి చెందిన ఎస్.రెడ్డెప్పరెడ్డి, టీ.సుండుపల్లెకు చెందిన గుత్తాబాబు అలియాస్ జి.శివప్రసాదనాయుడు, చెన్నైకి చెందిన ఆర్.శెల్వరాజ్‌లపై కూడా పీడీ యాక్టు నమోదుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు.