అన్నది ఒకటి... చేస్తున్నది మరొకటి
వీరఘట్టం: తోటపల్లి ఎడమ కాలువకు విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుడ్డిడి–శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం సంతనర్సిపురం గ్రామాల మధ్య ఈనెల 18న పడిన గండిని పూడ్చేందుకు ఎట్టకేలకు పనులు ప్రారంభించారు. యూటీ(అండర్ టెన్నల్) ఆకారంలో పనులు చేస్తామని నేతలు చెప్పినా పనుల ప్రారంభంలో సాధారణ యంత్రాలు వినియోగించడంతో స్థానికుల్లో అనుమానాలు మొదలయ్యాయి. బొబ్బిలి ఇరిగేషన్ ఎస్ఈ ఎంవీ రమణమూర్తి ఈ పనులను సోమవారం ప్రారంభించారు. సైఫన్ వద్ద కాంక్రీట్ రెడీ మిక్సింగ్‌తో ఫౌండేషన్ పనులు ప్రారంభించాల్సి ఉండగా సాధారణ మిక్సింగ్ యంత్రాన్ని తీసుకొచ్చారు. పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలంటే రెడీమేడ్ కాంక్రీట్ మిక్సింగ్ యంత్రం ద్వారానే సాధ్యమవుతుందని స్థానికులు అంటున్నారు.
నాణ్యతపై అనుమానాలు
ఇదిలా ఉండగా పంచాయతీ స్థాయిలో వేసే సిమ్మెంటు రోడ్డులతో పాటు ఏ ప్రభుత్వ నిర్మాణాలకైనా 53 గ్రేడ్ ఉన్న సిమెంటును వాడతారు. భారీ గండి పడిన ఈ ప్రాంతంలో మాత్రం 43 గ్రేడ్ సిమెంటు వినియోగించడంతో నాణ్యతపై అనుమానాలు వస్తున్నాయి. 50 ఎకరాల్లో సాగునీరు గగనంగా మారినా పనులు ఇలా చేస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షాలు పడినందున రైతుకు కాస్త ఊరటగా ఉంది. లేకుంటే ఈ పాటికే పొలం ఎండిపోయి ఉండేదని స్థానిక రైతులంటున్నారు. మిక్సర్ విషయంపై బొబ్బిలి సెక్షన్ ఎస్.ఈ.రమణమూర్తి వద్ద సాక్షి ప్రస్తావించగా రోడ్డు బాగోలేదని, ఈ రోడ్డు గుండా రెడీ మిక్సర్ రాలేదని తెలిపారు.