అక్షర రుషికి అంతిమ వీడ్కోలు
సీతాఫల్మండి, న్యూస్‌లైన్: మురికివాడల్లో అక్షర యజ్ఞం చేసి ఎందరో పేద విద్యార్థులను విజేతలుగా మలిచిన రుషి, అమరావతి విద్యాసంస్థల స్థాపకులు వట్టిపల్లి కోటేశ్వరరెడ్డికి విద్యార్థులు, అభిమానులు, నాయకులు నివాళులు అర్పించారు. ఆదివారం అకాల మృతి చెందిన కోటిరెడ్డి సారు మృతదేహాన్ని సోమవారం ఆయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా రామాపురానికి తరలించారు.
ఈ సందర్భంగా సాగిన యాత్రలో పలు పార్టీల నాయకులు, ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే పెద్దన్న వెళ్లిపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు. తమ మాస్టారిని కడసారి చూడాలని వచ్చినవారితో వీధులు జనసంద్రమయ్యాయి. కోటిరెడ్డి మాస్టారి మృతికి సంతాపంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. చిలకలగూడ, సీతాఫల్మండి, తదితర ప్రాంతాల్లోని దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.
మాస్టారికి నేతల నివాళి
కోటేశ్వర్‌రెడ్డి మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న పలుపార్టీల నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే జయసుధ, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు పద్మారావు, వైఎస్సార్సీపీ గ్రేటర్ కన్వీనర్ ఆదం విజయకుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణి, రవిప్రసాద్‌గౌడ్, డీఈఓ సుబ్బారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల జేఏసీ చైర్మన్ కోట్ల నిరంజన్‌రెడ్డి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.