లాటరీ పద్ధతిలో 600 వుడా ప్లాట్లు
బీచ్‌రోడ్ : దాకమర్రి లేఅవుట్‌కు జరిగిన వేలం పాటను రద్దు చేసి లాటరీ ద్వారా స్థలాలు విక్రయం చేయాలని కోరుతూ వుడా వీసీకి బీజేపీ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర మాట్లాడుతూ దాకమర్రి లేఅవుట్ వేలంపాటలో అమ్ముడయిన స్థలాల రేటు చూస్తే కళ్ళు తిరిగేటట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వుడా ఏర్పాటు ముఖ్య ఉద్దేశం పేద, మధ్య తరగతి నివాసం లేని వారికి స్థలాలు సరసమయిన ధరలకు అందించడమని తెలిపారు. గతంలో వుడా స్థలాలను లాటరీ పద్ధతిలో తక్కువ ధరకే అందించారు...అలాగే ఈ స్థలాలను కూడా లాటరీ ద్వారా విక్రయించాలని కోరారు. ఇందుకు వుడా వీసీ టి.బాబురావు నాయుడు బదులిస్తూ దాకమర్రిలో లేఅవుట్లు 24 క్యారట్ బంగారమని అభివర్ణిస్తూ...వాటికి ఆ ధర తక్కువేనని తెలిపారు. స్థలం రేటు, అభివద్ధి రేటు రెండూ మొత్తం రూ.10 వేలు కంటే ఎక్కువ అని... అందుకే వాటి ధర వేలంలో సరాసరి రూ. 14 వేలుకు వెళ్లిందని తెలిపారు. త్వరలో ఎల్ఐజీ, ఈబీజీ వారికి సుమారు 600 స్థలాలను లాటరీ పద్ధతిలో విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయం తీసుకుందని, త్వరలో విధి విధానాలు ప్రకటిస్తామని చెప్పారు. వుడా సంస్థ విశాఖను అభివృద్ధి చేయాలి అంటే...ఆదాయం లేకుండా ఎలా అభివృద్ధి సాధ్యమని ప్రశ్నించారు.