హిందుస్తాన్ జింక్ లాభం 19% అప్
న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,921 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,618 కోట్లతో పోలిస్తే 19 శాతం అధికం. రూపాయి క్షీణత, అధిక పరిమాణంలో విక్రయాలు .. లాభాల పెరుగుదలకు తోడ్పడినట్లు హిందుస్తాన్ జింక్ చైర్మన్ అగ్నివేష్ అగర్వాల్ తెలిపారు. ఆదాయం 21 శాతం వృద్ధితో రూ. 3,596 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇతర బేస్ మెటల్ ధరలు తగ్గుతున్నప్పటికీ జింక్ ధర మాత్రం మెరుగ్గానే కొనసాగిందని, పలు గనుల మూసివేత కారణంగా రాబోయే రోజుల్లోనూ దీని రేటు పటిష్టంగానే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాంపుర అగూచా, కయాద్, సిందేశ్వర్ ఖుర్ద్ తదితర గనుల కారణంగా జింక్ ఉత్పత్తి వార్షికంగా 42 శాతం పెరిగి 2,32,162 టన్నులకు చేరిందని పేర్కొన్నారు. అయితే, త్రైమాసికాల వారీగా చూస్తే మాత్రం 14 శాతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు.