దళిత ఉద్యోగిపై అటవీ శాఖ అధికారి వేధింపులు
కార్యాలయంలోనే లైంగికదాడికి యత్నం
ప్రాణహాని ఉందంటూ భయాందోళన
అర్బన్ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
సాక్షి, రాజమహేంద్రవరం :
తల్లి లేని ఓ దళిత ఉద్యోగినికి అండగా ఉండాల్సిన ఆ అధికారి ఆమెపై కన్నేశాడు. తండ్రి వయసు ఉన్న అతడు ఏడాదిగా లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. భవిష్యత్ కోసం, కళ్లు లేని తండ్రి కోసం.. ఆ ఉద్యోగిని బాధను భరించింది. చివరకు ప్రాణహాని ఉందన్న భయంతో మంగళవారం అర్బన్ జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. రాజమహేంద్రవరం డివిజన్ అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రావి మరియమ్మ తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. కొత్తపల్లి జోన్ ఫీల్డ్ స్టాఫ్ ప్లాన్టేషన్ మేనేజర్ మల్లి వెంకటేశ్వరరావు వేధింపులను బుధవారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు వెల్లడించింది. ఆమె చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
====
పశ్చిమగోదావరి జిల్లా పోడురు మండలం అప్పన్నచెర్వు గ్రామానికి చెందిన మరియమ్మకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి కి కళ్లు లేవు. దాతలు, బంధువుల సహకారంతో ఎంబీఏ పూర్తి చేసింది. రాజమహేంద్రవరం డివిజన్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం సంపాదించింది. కార్యాలయంలో ముఖ్య అధికారిగా ఉన్న కొత్తపల్లి జోన్ ఫీల్డ్ స్టాఫ్ ప్లాంటేషన్ మేనేజర్ మల్లి వెంకటేశ్వరరావు గతేడాది నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నారు. ఆమెకు ఎవరి అండ లేదన్న భావనతో, మాట వినకపోతే జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించేవారు. ఫోన్లో అసభ్యకర మాటలతో హింసించేవారు. ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయంతో ఆమె ఇంతకాలం భరిస్తూ మానసికంగా కుంగిపోయింది. కూతురులాంటి తనను తప్పుడు ఉద్దేశంతో చూడవద్దని ఆమె ఎన్నిసార్లు వేడుకున్నా అతడు వినిపించుకోలేదు.
ఈ నెల 3వ తేదీన...
ఈ నెల 3న డివిజనల్ మేనేజర్ క్యాంప్‌నకు, కొంతమంది ఉద్యోగులు ఆఫీసు పనిపై బయటకు వెళ్లారు. కంప్యూటర్ ఆపరేటర్ చెప్పడంతో ఆఫీసులో ఉండిపోయిన ఆమెపై అతడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ఎదురుతిరగడం, ఎవరో వస్తున్న వినికిడి రావడంతో అతడు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారాన్ని ఆమె తెలివిగా సెల్ఫోన్లో రికార్డు చేసింది. అయితే ఈ ఘటనతో తీవ్ర భయాందోళన చెందిన మరియమ్మ తనకు వెంకటేశ్వరరావు నుంచి ప్రాణహాని కలుగుతుందోనని బుధవారం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారికి ఫిర్యాదు చేశారు. విచారించి తనకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకుంది. ఉన్నతాధికారులు మల్లి వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.