త్వరలో ఎయిమ్స్‌కు వీణావాణి
* అనుమతులు వచ్చిన తర్వాత తరలింపు
* ఎయిమ్స్‌లో ఆపరేషన్ సాధ్యమే: వైద్య బృందం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను త్వరలో ఢిల్లీ తీసుకెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) వైద్య బృందం తెలిపింది. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకుని రక్తనాళాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఎయిమ్స్ న్యూరోసర్జన్స్ డాక్టర్ అశిష్ సూరి, డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ డాక్టర్ మనీష్ సింగాల్ బృందం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వీణావాణిల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు.
సుమారు రెండు గంటల పాటు పిల్లలతో గడిపారు. వీణావాణిలను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే శస్త్రచికిత్సపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స సాధ్యమేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ డెరైక్టర్‌కు లేఖ రాయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయి.. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వీణావాణిలను ఢిల్లీ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.