పాడి పశువుల పోషణలో శాస్త్రీయ పద్ధతులు అవసరం
శంషాబాద్ రూరల్ : శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పశు పోషణ చేపడితే అధిక పాల దిగుబడి సాధించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ వీరనంది తెలిపారు. గురువారం మండలంలోని చిన్నగోల్కొండలో పాడి పశువుల పోషణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ వీరనంది మాట్లాడుతూ.. పాడి పశువులకు తగిన మోతాదులో పోషకాలతో కూడిన దాణా, మేతను అందిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ చేపడితే ఆర్థికంగా నిలదొక్కుకుంటారని తెలిపారు. యాజమాన్య పద్ధతులతో పాడిని లాభసాటిగా మార్చుకోవచ్చని తెలిపారు. బహువార్షిక గడ్డి సాగుతో పశువులకు మేత కొరత తీరుతుందని పేర్కొన్నారు. దూడలకు పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. చాలా మంది రైతులు దూడల పోషణపై దృష్టి పెట్టకపోవడంతో పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. పశువులకు, దూడలకు సకాలంలో టీకాలు, సీజన్వారీగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ఉమాకాంత్, వైద్యులు రవిచంద్ర, వంశీకృష్ణ పాల్గొన్నారు.