veerapanenigudem
-
పోర్టుకు ఆనాడు 2వేల ఎకరాలు చాలన్నారే
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్): ప్రభుత్వానికి భూములిచ్చేది లేదని తేల్చి చెప్పండంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపునిచ్చారు. గురువారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 17 రోజులుగా కొండ పోరంబోక సాగుదారులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. 70ఏళ్ళ నుంచి రైతులు సాగుచేస్తున్న భూములలో సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సిపి పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. అనంతరం పశువుల ఆస్పత్రి వద్ద జరుగుతున్న దీక్షా శిబిరంలో సాగుదారులనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 4.11 లక్షల ఎకరాల భూములు సాగుదారుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బలవంతంగా సెంటు భూమి కూడా ఇవ్వబోమని రైతాంగం పోరాటం చేయాలన్నారు. చట్టాలను పక్కనబెట్టి భూసేకరణకు పాల్పడితే సహించేది లేదని మధు హెచ్చరించారు. 2004లో భూములు ఇచ్చిన రైతులు కూలీలుగా మిగిలిపోయారని చెప్పారు. బందరు పోర్టుకు 5,500 ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇస్తే అప్పట్లో 2 వేలు ఎకరాలు చాలని నానా యాగీ చేసిన టీడీపీ ఈ రోజు 33వేల ఎకరాలు రైతుల వద్ద ఎందుకు సేకరించాలని చూస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలోని భూములు కోల్పోయే రైతులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి డిసెంబరులో చలో విజయవాడ చేపడతామని చెప్పారు. భూ సేకరణ చట్టం ప్రకారమే చేయాలి భూసేకరణ చట్టం రూపకల్పన సమయంలో రైతాంగానికి మేలు చేయాలని చెప్పిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని విస్మరించటం సరికాదన్నారు. భూముల పేరుతో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేయడానికి భూములు తీసుకుంటున్నారని, ఒంగోలులో వాన్‌పిక్, అనంతపురంలో లేపాక్షీ భూముల బాగోతాలు నిదర్శనాలని మధు చెప్పారు. తూర్పు గోదావరి తొండంగిలో రైతుల పై లాఠీఛార్జి చేసి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకుంటే ఆ భూములపై ఆధారపడ్డ పశువుల యజమానులకు, జీవాలకు, కూలీలకు, అందరికీ పరిహారం చెల్లించి తీరాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరాలని, కుటుంబంలో పని చేసే వారందరికీ నెలకు రూ.2500 చెల్లించాలని తెలిపారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడిపి భూములు లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. రైతులకు మద్దతు పలకాలి: కొల్లి వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్ మాట్లాడుతూ రాజకీయపార్టీలకు అతీతంగా రైతులకు మద్దతు అందరూ పలకాలని పిలుపునిచ్చారు. ఈ భూములపై ఆధారపడ్డ అందరినీ పోరాటంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత వై.నరసింహారావు , సీపీఎం కార్యదర్శి కళ్ళం వెంకటేశ్వరరావు, నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి రోసిరెడ్డి, పిల్లి మహేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి, అబ్ధుల్ బారి, కైలే ఏసుదాస్, మల్లంపల్లి జయమ్మ, వైఎస్సార్సిపి నాయకుడు బండి నాగసాంబిరెడ్డి, సిపిఐ నాయకుడు పడమట నరేష్, పాలకేంద్రం అధ్యక్షుడు ఉయ్యూరు శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రీయల్ క్లస్టర్
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్) : వీరపనేనిగూడెం ప్రాంతాన్ని మోడల్ ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా తయారుచేసేందుకు కృషి చేస్తామని అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవీ రావు చెప్పారు. ఏపీ ఐఐసీ విజయవాడ రీజియన్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శరత్‌బాబు ఆధ్వర్యంలోని పారిశ్రామికవేత్తల బృందం సోమవారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని కొండపోరంబోక సర్వే నంబర్ 192/7బీ భూములను సందర్శించింది. ఈ సందర్భంగా ఏవీ రావు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధానిలో పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించగా, వీరపనేనిగూడేన్ని సూచించారని చెప్పారు. ఇక్కడ పారిశ్రామిక వేత్తలు ఒక్కో పరిశ్రమకు రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకూ పెట్టుబడులు పెడతారన్నారు. డాక్టర్ నన్నపనేని మురళీ మాట్లాడుతూ రాబోయే తరానికి మంచి భవిష్యత్ అందించే లక్ష్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశ్రామికవేత్త వేణుబాబు మాట్లాడుతూ పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న తాము డిప్లొమా, ఐటీఐ వారికి ఉపాధిని అందిస్తామన్నారు. ఏపీఐఐసీ డీజీఎం శరత్‌బాబు మాట్లాడుతూ 86 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఆ మేరకు పారిశ్రామిక వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పారు. -
వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్షిప్
► ఏర్పాటుకు 200 ఎకరాల భూమి గుర్తింపు ► సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ► ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మౌలిక వసతులు-నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం, కార్మికుల గృహ వసతి ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అక్కడ 200 ఎకరాలను గుర్తించామన్నారు. ఆయన బుధవారం విజయవాడలోని కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే సకల సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. భూములు కేటాయించడమే కాకుండా రహదారులు నిర్మిస్తామని,విద్యుత్ సరఫరా చేస్తామని, నీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్ఎంఈ యూనిట్లకు మౌలిక వసతుల కల్పన,అనుమతుల మంజూరుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్ స్టాక్ యార్డులను విజయవాడలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈలు సరికొత్త ఆలోచనలలు, పెట్టుబడులతో ముందుకురావాలని సీఎం సూచించారు. తక్కువ ధరకు భూములు విక్రయించండి లీజు ప్రాతిపదికన కాకుండా తక్కువ ధరకు తమకు భూములు విక్రయించాలని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. భూమి అందుబాటు ధరలో ఉంటే మరిన్ని యూనిట్లు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. గన్నవరం నుంచి వీరపనేనిగూడెం వరకు రవాణ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఫ్లైఓవర్ నిర్మించాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడ త్వరలోనే రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుకునే బాధ్యత ఎంఎస్ఎంఈలదేనని, పరిశ్రమల లేఔట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం వీరపనేనిగూడెంలో 200 ఎకరాలను అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేషన్‌కు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. టౌన్షిప్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా ఎన్ఆర్ఐ రవిని ముఖ్యమంత్రి నియమించినట్లు చెప్పారు. అమరావతి అసోసియేషన్‌లో 60 కంపెనీలకు సభ్యత్వం ఉందన్నారు.