పోర్టుకు ఆనాడు 2వేల ఎకరాలు చాలన్నారే
పోర్టుకు ఆనాడు 2వేల ఎకరాలు చాలన్నారే
Published Thu, Oct 13 2016 9:16 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్): ప్రభుత్వానికి భూములిచ్చేది లేదని తేల్చి చెప్పండంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపునిచ్చారు. గురువారం గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో 17 రోజులుగా కొండ పోరంబోక సాగుదారులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. 70ఏళ్ళ నుంచి రైతులు సాగుచేస్తున్న భూములలో సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సిపి పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. అనంతరం పశువుల ఆస్పత్రి వద్ద జరుగుతున్న దీక్షా శిబిరంలో సాగుదారులనుద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో 4.11 లక్షల ఎకరాల భూములు సాగుదారుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, బలవంతంగా సెంటు భూమి కూడా ఇవ్వబోమని రైతాంగం పోరాటం చేయాలన్నారు. చట్టాలను పక్కనబెట్టి భూసేకరణకు పాల్పడితే సహించేది లేదని మధు హెచ్చరించారు. 2004లో భూములు ఇచ్చిన రైతులు కూలీలుగా మిగిలిపోయారని చెప్పారు. బందరు పోర్టుకు 5,500 ఎకరాలు కావాలని నోటిఫికేషన్ ఇస్తే అప్పట్లో 2 వేలు ఎకరాలు చాలని నానా యాగీ చేసిన టీడీపీ ఈ రోజు 33వేల ఎకరాలు రైతుల వద్ద ఎందుకు సేకరించాలని చూస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్రంలోని భూములు కోల్పోయే రైతులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి డిసెంబరులో చలో విజయవాడ చేపడతామని చెప్పారు.
భూ సేకరణ చట్టం ప్రకారమే చేయాలి
భూసేకరణ చట్టం రూపకల్పన సమయంలో రైతాంగానికి మేలు చేయాలని చెప్పిన టీడీపీ, బీజేపీలు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని విస్మరించటం సరికాదన్నారు. భూముల పేరుతో ప్రభుత్వ పెద్దలు వ్యాపారం చేయడానికి భూములు తీసుకుంటున్నారని, ఒంగోలులో వాన్‌పిక్, అనంతపురంలో లేపాక్షీ భూముల బాగోతాలు నిదర్శనాలని మధు చెప్పారు. తూర్పు గోదావరి తొండంగిలో రైతుల పై లాఠీఛార్జి చేసి భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకుంటే ఆ భూములపై ఆధారపడ్డ పశువుల యజమానులకు, జీవాలకు, కూలీలకు, అందరికీ పరిహారం చెల్లించి తీరాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించి తీరాలని, కుటుంబంలో పని చేసే వారందరికీ నెలకు రూ.2500 చెల్లించాలని తెలిపారు. అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడిపి భూములు లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు.
రైతులకు మద్దతు పలకాలి: కొల్లి
వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు కొల్లి రాజశేఖర్ మాట్లాడుతూ రాజకీయపార్టీలకు అతీతంగా రైతులకు మద్దతు అందరూ పలకాలని పిలుపునిచ్చారు. ఈ భూములపై ఆధారపడ్డ అందరినీ పోరాటంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత వై.నరసింహారావు , సీపీఎం కార్యదర్శి కళ్ళం వెంకటేశ్వరరావు, నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి రోసిరెడ్డి, పిల్లి మహేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి, అబ్ధుల్ బారి, కైలే ఏసుదాస్, మల్లంపల్లి జయమ్మ, వైఎస్సార్‌సిపి నాయకుడు బండి నాగసాంబిరెడ్డి, సిపిఐ నాయకుడు పడమట నరేష్, పాలకేంద్రం అధ్యక్షుడు ఉయ్యూరు శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement