వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ | Model industrial Township at krishna district veerapanenigudem | Sakshi
Sakshi News home page

వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్

Published Thu, Feb 18 2016 10:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్

వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్

► ఏర్పాటుకు 200 ఎకరాల భూమి గుర్తింపు
► సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
► ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
 
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెంలో మోడల్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మౌలిక వసతులు-నైపుణ్యాభివృద్ధి శిక్షణ  కేంద్రం, కార్మికుల గృహ వసతి ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం అక్కడ 200 ఎకరాలను గుర్తించామన్నారు. ఆయన బుధవారం విజయవాడలోని కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులతో సమావేశమయ్యారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే సకల సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

భూములు కేటాయించడమే కాకుండా రహదారులు నిర్మిస్తామని,విద్యుత్ సరఫరా చేస్తామని, నీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు మౌలిక వసతుల కల్పన,అనుమతుల మంజూరుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, సెయిల్ స్టాక్ యార్డులను విజయవాడలో నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్‌ఎంఈలు సరికొత్త ఆలోచనలలు, పెట్టుబడులతో ముందుకురావాలని సీఎం సూచించారు.
 
తక్కువ ధరకు భూములు విక్రయించండి
లీజు ప్రాతిపదికన కాకుండా తక్కువ ధరకు తమకు భూములు విక్రయించాలని ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. భూమి అందుబాటు ధరలో ఉంటే మరిన్ని యూనిట్లు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. గన్నవరం నుంచి వీరపనేనిగూడెం వరకు రవాణ  సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఫ్లైఓవర్ నిర్మించాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడ త్వరలోనే రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ను  దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుకునే బాధ్యత ఎంఎస్‌ఎంఈలదేనని, పరిశ్రమల లేఔట్లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి,  ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం
వీరపనేనిగూడెంలో 200 ఎకరాలను అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేషన్‌కు కేటాయించినట్లు మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తెలిపారు. టౌన్‌షిప్ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా ఎన్‌ఆర్‌ఐ రవిని ముఖ్యమంత్రి నియమించినట్లు చెప్పారు. అమరావతి అసోసియేషన్‌లో 60 కంపెనీలకు సభ్యత్వం ఉందన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement