Veganism
-
వీగన్స్: కనీసం జంతువుల పాలు కూడా తాగరు..మరి ప్రోటీన్స్ ఎలాగంటే..
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది వీగన్స్గా మారిపోతున్నారు. ఈమధ్య వీగన్ డైట్‌ను పాటించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ప్రచారం పెరగడం, ఈ కొత్త రకం డైట్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం, సెలబ్రిటీలు కూడా వీగన్స్గా మారిపోతుండటంతో చాలామంది ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు. వీగన్లు పాల ఉత్పత్తులు, తేనె, తోలు, ముత్యాల వంటి వాటికి దూరంగా ఉంటారు. మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. ఏటా నవంబర్ 1న వరల్డ్ వీగన్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా వీగన్ డైట్ వల్ల అన్నీ ప్రయోజనాలేనా? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. జంతువులకు హానీ చేయకుండా, శాకాహారాన్ని ప్రోత్సహిస్తూ ఈ మధ్య అందరూ వీగన్స్గా మారుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ డైట్‌ను ఫాలో అవుతున్నారు.1944 నవంబర్ నెలలో ది వీగన్ సొసైటీని డొనాల్డ్ వాట్సన్ ఏర్పాటు చేశాడు. వీగన్, వీగనిజమ్ అనే పదాలు పుట్టింది కూడా అప్పుడే. వీగన్ డైట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తిగా శాఖాహార పదార్థాలనే తీసుకోవడం. జంతు సంబంధిత ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, కేవలం వృక్ష సంబంధిత ఆహారాలను తీసుకోవడం ఈ డైట్ ముఖ్య ఉద్దేశం. ఇక వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు. వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్ నైలాన్, కార్డ్ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్ వంటి సెలబ్రిటీలు సైతం కొన్నేళ్లుగా వీగన్స్గా మారి అలాంటి డైట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ రిస్క్ తక్కువ పూర్తి శాకాహారాన్ని అనుసరించడం వల్ల చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తూ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. వీగన్ డైట్‌తో నష్టాలివే ►వీగన్ డైట్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. ► వీగన్స్‌లో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ B12 పోషకాల లోపం ఉండే అవకాశం ఉంది. చివరగా చెప్పేదేంటంటే.. వెజీటేరియన్స్ అయినా, వీగన్స్గా మారినా తమ శరీర తత్వాన్ని బట్టి డైట్‌ను ఫాలో అవ్వాలి. శృతి మించితే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
చికెన్ తింటున్నారా? భవిష్యత్తులో క్యాన్సర్ రావొచ్చు, ఎందుకంటే..
ఏం తింటున్నాం.. ఎలా ఉంటున్నాం.. జంతువులను బాధిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకుంటూ బతికేస్తున్నామా..?! ‘జంతువులనే కాదు, జంతు ఆధారిత ఉత్పత్తుల నుంచి కూడా దూరంగా ఉందాం.. ’ అంటూ వరల్డ్ వీగన్ డే సందర్భంగా వీగన్ ప్రేమికులు చెప్పే మాటలు అందరూ అనుసరించదగినవి, ఆచరణలో పెట్టాల్సినవి... దుఃఖాన్ని పిండుకు తాగుతున్నాం శాకాహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యమే కాదు, పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది. నేను యానిమల్ లవర్ని, యాక్టివిస్ట్‌ని. జంతువులను బాధించడానికి మనకు ఎలాంటి హక్కుల్లేవు. చాలామంది మాంసాహారం రుచి మీదనే దృష్టి పెడతారు. తరతరాలుగా ఇది అలాగే వస్తోంది. మనం తినడానికే అవి పుట్టాయని మనుషుల ఒక క్రూరమైన ఆలోచన. పాల పరిశ్రమ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద క్రూరమైన ప్రక్రియ. పాల రూపంలో వేరే జీవి బాధని గ్లాసులో పోసుకొని తాగుతున్నాం అనిపిస్తుంది. ఒక గ్లాసు పాలతో తల్లి–బిడ్డను వేరు చేస్తున్నాం. పాలు తాగుతున్న బిడ్డ మూతి కట్టి, ఆ తల్లి పాలు పిండుకుంటున్నాం. ఇవన్నీ గమనించి 13 ఏళ్లుగా వీగన్ డైట్‌కి మారిపోయాను. ఈ ప్రకృతిలో ప్రతి జీవికీ బతికే హక్కు ఉంది. జంతువుల సంఖ్య అదుపు చేయాలంటే మనం వాటిని చంపుకు తినాలి అనే మనస్తత్వం పెరిగింది. అదే జంతుజాలాన్ని నాశనం చేస్తుంది. కోళ్లకు, ఆవులకు, గేదెలకు కృత్రిమ ఇంజక్షన్లు ఇస్తారు. ఏదైనా తప్పుగా తింటే అది మన ఆరోగ్యంపైనే చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఇవన్నీ గమనించి మనమంతా వీగన్కి మారిపోవాల్సిందే. ఈ రోజుల్లో ఇది అత్యవసరం కూడా. – ప్రతిమా సాగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ సాధు స్వభావానికి.. మొదట్లో మనిషి ఆహారానికి మొక్కల మీదే ఆధారపడేవాడు. ఇప్పుడంతా ఏది కరెక్ట్‌గా తినాలి, ఏది తినకూడదు అనేదానిపై చాలా అనుమానాలు ఉంటున్నాయి. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాంసాహారానికి ఏ మాత్రం ప్రాముఖ్యం లేదు. ఇప్పుడైతే అస్సలు తీసుకోం. శాకాహారానికి సైడ్ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఆరోగ్యం బాగో లేకపోతే ముందు నాన్‌వెజ్ తీసుకోవద్దు అని చెబుతారు. కానీ, శాకాహారం విషయంలో అలా ఉండదు. జంతువులకు కూడా మనలాగే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. దూడ పాలు తాగాక అవి మిగిలిన పాలు తీసుకోవడం వరకు పర్లేదు. కానీ, జంతువులను బాధించి, వాటినుంచి మనం ఆహారం పొందుతున్నాం. జంతువుల మీద క్రూరత్వాన్ని చూపుతున్నా.. అదెలాగంటే ఒక జంతువును చూస్తే దానిని కొట్టాలనే ఆలోచనకే వెళుతున్నాడు మనిషి. శాకాహారం మాత్రమే తీసుకుంటే మనిషి సాధు స్వభావిగా ఉంటాడు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో క్రూరత్వాన్ని దూరం చేయాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. వాహనసదుపాయాలు ఏవీ లేని రోజుల్లో రవాణాకు జంతువులను ఉపయోగించేవారు. ఇప్పుడు అలా లేదు. అలాగే మనలో కూడా మార్పు రావాలి. – స్టెల్లా మరేజ్, గంధంగూడ, నార్సింగ్ , హైదరాబాద్ హింసను తెలుసుకొని.. నేను వీగన్‌గా మారి మూడేళ్లు అయ్యింది. అన్ని డెయిరీ, పౌల్ట్రీ కంపెనీలలో జరుగుతున్న హింసను తెలుసుకొని వీగన్‌గా మారిపోయాను. క్యాల్షియం కావాలంటే పాలు తాగాలంటారు. వీటి బదులు నువ్వులు తీసుకోవచ్చు. చికెన్, మీట్లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. వాటి గ్రోత్‌కి ఇచ్చే ఇంజక్షన్స్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు రావచ్చు. హార్మోనల్ సమస్యలు కూడా రావచ్చు. వీగన్ ఫుడ్ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థ్రరైటిస్ సమస్య తగ్గుతుంది. వీగన్ అని విని ఇదేదో పాశ్చాత్యులు తీసుకునేది, మనది కాదు అనుకోకూడదు. కానీ, ప్రాచీనకాలం నుంచి మనం చేస్తున్నదే. దీని వల్ల మన ఆరోగ్యమే కాదు, పర్యవరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. – హర్షిత వెంపటి, ఉప్పల్, హైదరాబాద్ యవ్వనంగా ఉండచ్చు వీగన్ ఆహారం తీసుకోవడం వల్ల జంతువులను బాధించడం తగ్గించవచ్చు. మనం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. పర్యావరణానికి మేలు జరుగుతుంది. విదేశీయులు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీగన్ డైట్‌కు మారిపోతున్నారు. ప్రకృతి మనకు ఎన్నింటినో ఫ్రీగా ఇచ్చింది. మనం వాటిని రక్షించుకోకుండా పాడు చేస్తున్నాం. జంతువులంటే ఇష్టపడేవారు, ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలనుకునేవారు వీగన్కి మారిపోవడం ఎంతో మంచిది. నేను పదేళ్లుగా వీగన్ డైట్ తీసుకుంటాను. వీగన్ కెఫేని కూడా రన్ చేస్తున్నాను. పాలు, జంతు ఆధారిత ఉత్పత్తులేవీ లేకుండా వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన తీసుకువస్తుంటాం. – సిమి, సిమిస్ వరల్డ్ ప్రగతి నగర్, హైదరాబాద్ ఒక్కరాత్రిలో మారిపోయాను మూడేళ్లుగా వీగనిజానికి మారిపోయాను. నేను మా కుక్క గాయపడటం చూశాను. అది కొన్ని రోజులు పాటు ఎంత బాధపడిందో దగ్గరగా చూశాను. కోడి, మేక బాధ కూడా అంతే కదా! ఆ ఆలోచన వచ్చి ఒక్క రాత్రిలో వీగన్కి మారిపోయాను. జంతువుల పాలు తీసుకోవడం కూడా మానేశాను. ఆన్లైన్లో వీగన్ డైట్ ప్లాన్ చూశాను. అందులో న్యూట్రిషన్ సాయం కూడా తీసుకోవచ్చు. మన శరీరానికి ఎలాంటి ఆహారం అనువైనది, ఎంత అవసరం అనేది ఎక్స్పర్ట్ సలహా తీసుకున్నాను. మన చుట్టూ ఉండే పర్యావరణం బాగుండాలంటే ముఖ్యంగా మనలో మార్పు రావాలి. – పంచ్, వీగన్ యాక్టివిస్ట్ -
‘వేగన్’న్యువరీ ఉద్యమం.. శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు!
సమాజంలో చాలామందిలో మాంసాహారపు అలవాట్లు ఉన్నప్పటికీ... శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న భావన ఎప్పట్నుంచో ఉన్నదే. శాకాహార అలవాటు తాలూకు విప్లవంగా రూపొందిందే ఈ ‘వేగన్యువరీ’. జనవరి (జాన్యువరీ) లాగే ‘వేగన్’న్యువరీ అనే ఓ దీక్ష తీసుకుని నెల్లాళ్లపాటు శాకాహారపు అలవాటు పెంపొందించుకుని, అది మంచి ఫలితాలనే ఇస్తే దాన్నే కొనసాగించాలని కోరుతూ నడుస్తున్న ఉద్యమమే ఈ ‘వేగన్’న్యువరీ. దీని గురించి కొన్ని వివరాలు.... దాదాపు 2014 నుంచి ఈ వేగన్ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ మనదేశంలో మాత్రం ఇది అధికారికంగా 2021 డిసెంబరు 9న ప్రారంభమైంది. ప్రత్యేకత? ‘వేగన్’న్యువరీ అనే పేరుతో తొలుత భూతదయా, అటు తర్వాత మొక్కలనుంచే శాకాహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యం పెంపొందించుకోవడం, జీవావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ కాపాడుకోవడం కోసం కృషి చేయడం వంటి కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ ‘వేగన్’న్యువరీ ఉద్యమానికి మంచి ఆదరణే వస్తోంది. జనవరి మాసమంతా శాకాహారానికి మళ్లుతామంటూ ప్రతినబూనడమే ఈ ‘వేగన్’న్యువరీ మాసపు ప్రత్యేకత అన్నమాట. పెద్ద సంఖ్యలో చేరువవుతున్న ప్రజలు గతేడాది అంటే 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,20,000 మందికి పైగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు. కేవలం మాంసాహారంలోనే మంచి రుచులు అందుతాయనే వాదనను తోసిరాజంటూ... ఈ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం కోసం శాకాహారాల్లో కొత్త కొత్త రుచులు అన్వేషిస్తున్నారు. దీనికి తార్కాణమే గతేడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన శాకాహార ఉత్పాదనలు! ఒక అంచనా ప్రకారం 2022లో దాదాపు 1,540 కొత్త శాకాహార ఉత్పాదనలు (వేగన్ ప్రాడక్ట్స్) అందుబాటులోకి వచ్చాయి. ‘వేగన్’న్యువరీ ఉద్యమానికి అత్యద్భుతంగా ప్రచారాలను కల్పించే ఆ శాకాహార ప్రాధాన్యానికి గతేడాది ప్రపంచవ్యాప్తంగా 4,351 మీడియా కథనాలు వెలువడ్డాయనేది మరో అంచనా. దీనికితోడు ఎన్నో కార్పొరేట్ సంస్థలు సైతం అనేక ప్రచార కార్యకలాపాల ద్వారా ఈ ఉద్యమానికి తోడు నిలుస్తున్నాయి. మన దేశానిది మూడోస్థానం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.3 లక్షల మంది ఈ ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకుంటే అందులో 65,000 మంది మన భారతీయులే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ ప్రచార కార్యకలాపాల్లో 228 దేశాలు పాలుపంచుకుంటుండగా... వీటన్నింటిలో మన దేశం మూడో స్థానంలో ఉండటం కూడా ఓ విశేషం. మనకంటే ముందు స్థానంలో ఉన్న దేశాల్లో మొదటిది యునైటెడ్ కింగ్డమ్ (ఇంగ్లాండ్) కాగా... రెండోది యూఎస్ఏ. వీళ్లే మన దేశపు బ్రాండ్ అంబాసడర్లు... ఈ ఉద్యమపు పదో వార్షికోత్సవం సందర్భంగా మనదేశం నుంచి దాదాపు పదిమంది ప్రముఖులు ఈ క్యాంపైన్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు. వీరిలో ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సౌందర్యశర్మ, మరో ప్రముఖ నటుడు, ప్రో–బాస్కెట్‌బాల్ ఆటగాడు అరవింద్‌కృష్ణ, మ్యూజీషియన్, నటి మోనికా డోగ్రా, ప్రముఖ మౌంటెనీరింగ్ నిపుణురాలు ప్రకృతి వర్షిణీ, మరో మౌంటనీరింగ్ నిపుణుడు కుంతల్ జోయిషర్, ప్రో–టెన్నిస్ ఆటగాడు విశ్వజిత్ సాంగ్లే, గాయని అనుష్కా మన్‌చందా, మరో ప్రముఖ నటీమణులు స్నేహా ఉల్లాల్, సదా సయీద్ మన దేశం నుంచి ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రచారకులుగా వ్యవహరిస్తున్నారు. మరో వారంలో జనవరి అయిపోతోంది. కనీసం ఆఖరి వారంలో నైనా వేగన్యువరీని అనుసరిద్దాం. ఆరోగ్యమూ బాగుంటుంది ‘వేగనిజం’ అనేది ఓ సంస్కృతి. ఈ సంస్కృతితో మనం తోటి జీవులకు ఎలాంటి హానీ కలగకుండా చూడవచ్చు. అందుకే నేను శాకాహార ఉద్యమాన్ని సమర్థిస్తుంటాను. అంతేకాదు... శాకాహారం తీసుకోవడం వల్ల మన చర్మానికి మంచి నిగారింపు రావడంతో పాటు మన ఆరోగ్యమూ బాగుంటుంది. ఏ జీవికీ హాని లేకుండా మనమూ బతికి, ఇతరులనూ బతకనివ్వడం అనే భావనే ఎంతో ఉన్నతమైనదని నా ఉద్దేశం. – స్నేహా ఉల్లాల్,సినీ నటి. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ముక్క వైపే మొగ్గు.. భారత్‌లో తగ్గుతున్న శాకాహారులు!
సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగానో లేక ఆరోగ్యకర జీవనాన్ని గడుపుదామనో లేదా జంతు సంరక్షణ కోసమో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాంసాహారం నుంచి శాకాహారం వైపు మళ్లుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. స్టాటిస్టా గ్లోబల్ కన్జూమర్ సర్వే ప్రకారం.. చాలా దేశాల్లో వెగాన్ డైట్ ట్రెండ్ నెమ్మదిగా విస్తరిస్తోంది. ముఖ్యంగా యూరప్‌లోని కొన్ని దేశాలతోపాటు అమెరికాలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. కానీ భారత్‌లో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితి నెలకొంది. దేశంలో సంప్రదాయక శాకాహారులు సర్వభక్షకులుగా మారుతుండటం అంతకంతకూ పెరుగుతోంది. 2018–19లో పట్టణ ప్రాంత భారతీయుల్లో మూడో వంతు మంది తాము శాకాహారులమని పేర్కొనగా 2021–22 నాటికి వారి శాతం ఒక వంతుకు పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే గత మూడేళ్లలో వెజిటేరియన్ డైట్ ప్రజాదరణ పొందినప్పటికీ కొన్ని దేశాలు మాత్రం నేటికీ మాంసాహారం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. మెక్సికో, స్పెయిన్ వంటి దేశాల్లో నేటికీ శాకాహారం భుజించే వారి శాతం అటుఇటుగా 3 శాతంగా ఉంటోందని అధ్యయనం తెలిపింది. దక్షిణకొరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ 2018–19లో 0.9 శాతంగా ఉన్న శాకాహారులు 2021–22 నాటికి 2.5 శాతానికి పెరగడం గమనార్హం. -
నయా ట్రెండ్ ‘వేగన్ ఫుడ్’..!
సాక్షి, హైదరాబాద్: నవాబుల కాలం నుంచి పేరుగాంచిన బిర్యానీ మొదలు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కలిగిన కాంటినెంటల్ ఫుడ్ వెరైటీల వరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది మన భాగ్యనగరం. వినూత్న రుచులను ఆహ్వానించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. అయితే సిటీలో ఈ మధ్య విరివిగా వినిపిస్తున్న పదం ‘వేగన్ ఫుడ్’.. ఈ ఫుడ్ కోసమే ప్రత్యేకంగా పదుల సంఖ్యలో వేగన్ రెస్టారెంట్లు కూడా వెలిశాయి. వేగన్ ఫ్రెండ్లీ సిటీగా హైదరాబాద్.. ‘వేగనిజమ్’లో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ వేగన్ ఫుడ్. జంతువుల మాంసమే కాకుండా పాలు, గుడ్లు, నెయ్యిలాంటి ఇతర జంతు సంబంధిత పదార్థాలను తినని వారిని, జంతు సంబంధిత పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడని వారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగజీవాల స్వేచ్ఛా వాతావరణానికి హానితలపెట్టకుండా వాటి జీవన భద్రతకు వేగన్స్ కృషి చేస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ నగరంలో కూడా వేగనిజంపై ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది. చదవండి: కోన్ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్!! గత దశాబ్దకాలంగా జంతు ప్రేమికుల ఆధ్వర్యంలో వేగన్ క్లబ్‌లు, వేగన్ గ్రూప్స్ ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా వేగన్ ఫుడ్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వేగన్ ఫుడ్ ప్రాచుర్యం పొందడమే కాకుండా ఎన్నో వేగన్ ఫుడ్ కోర్ట్‌లను ప్రారంభిస్తున్నారు. 2015లో హైదరాబాద్‌లో మొట్టమొదటి వేగన్ కేఫ్ ఏర్పాటు కాగా, ప్రస్తుతం అలాంటివి పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా 2019లోనే ‘పెటా’ఆధ్వర్యంలో ‘మోస్ట్ వేగన్ ఫ్రెండ్లీ సిటీ’గా నగరాన్ని ఎంపిక చేయడం విశేషం. విభిన్న రుచుల సమ్మేళనం.. వేగన్స్ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైనిక్‌పురి తదితర ప్రాంతాల్లో ఫుడ్ రెస్టారెంట్లు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్ల వంటి ఫుడ్ స్పాట్స్ ఉన్నాయి. జంతు సంబంధ పదార్థాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు తదితర మొక్కల పదార్థాలతో ఈ ఫుడ్‌ని తయారు చేస్తారు. ఇందులో భాగంగా సాండ్వెజ్లు, సలాడ్స్, డిసెర్ట్స్, కేక్‌లు, చాక్లెట్లు తయారు చేస్తున్నారు. చదవండి: చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? ఆరోగ్య ప్రధాయిని.. జంతు హింసపైన అవగాహన పెంచడమే కాకుండా వేగన్ల ఆహార సౌలభ్యం కోసం వినూత్నంగా వేగన్ ఫుడ్ కేఫ్‌ను ఏర్పాటు చేశాం. వేగన్స్ని సంతృప్తి పరచడానికి పిజ్జాలు, డిసర్ట్స్తో పాటు పలురకాల ఫుడ్‌ను తయారు చేస్తున్నాం. అంతే కాకుండా వేగన్ ఫుడ్ స్టోర్ ప్రారంభించాం. జీవన సమతుల్యం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడంలో వేగన్ ఫుడ్ విశిష్టతను కలిగి ఉంటుంది. వేగన్స్ మాత్రమే కాదు నాన్ వేగన్స్ కూడా కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. - వేద్ మోహన్, ఈ–వేగన్ ఫుడ్ స్టోర్, కేఫ్, సైనిక్‌పురి -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే...
మనుషుల్ని ప్రేమించే వీళ్లు.. జంతువుల హక్కుల కోసం పోరాడుతారు. అందుకు కఠినతరమైన ఆహార నియమాలు పాటిస్తారు. తీసుకునే ఆహారంలో, వేసుకునే దుస్తుల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వాళ్లతో మాట కలిపితే.. జంతువుల వేదనను కథలు కథలుగా చెప్పి మనలో ఓ ఉద్యమానికి బీజం వేస్తారు. వారే.. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కృషి చేస్తున్న వీగన్లు. ప్రపంచ వీగన్ల దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన కొన్ని విశేషాలు.. -వీగన్ సొసైటీ 1944లో ప్రారంభమైంది. ఇద్దరు స్నేహితులు.. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలన్న ఆవశ్యకతతో ‘ది వీగన్ సొసైటీ’ని స్థాపించారు. నేటికి ఈ సంస్థ ప్రారంభమై 75 ఏళ్లు. వరల్డ్ వీగన్ మాసంగా సెలబ్రేట్ చేసుకునే నవంబర్ నెలలో పెద్ద ఎత్తున వీగనిజం, వీగన్‌గా ఉంటే కలిగే ప్రయోజనాల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిచండం పరిపాటి. పల్లీ పాలతో ప్రోటీన్లు.. వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా కఠినమైన ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్ కేక్ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు. సోయాతో దుస్తుల తయారీ వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా... కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్ నైలాన్, కార్డ్ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక స్టెల్లా మెక్క్యాట్నీ, నాస్టీగాళ్, మ్యాట్ అండ్ న్యాట్, బియాండ్ స్కిన్ బ్రాండ్లు ప్రస్తుతం వీగన్ ఫ్యాషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సైతం తక్కువే. వీగన్ బ్రాండ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెటా సంస్థ.. ప్రతీ సంవత్సరం వీగన్ ఫ్యాషన్ అవార్డును కూడా అందజేస్తుంది. కొలెస్ర్టాల్ ఫ్రీ వీగన్ ఫుడ్ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. గుడ్లు, మాంసానికి ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్ గుడ్లను, వెజిటేరియన్ మాంసాన్ని అభివృద్ధి చేశారు ఢిల్లీ ఐఐటికి చెందిన పరిశోధకులు. వెజిటేరియన్ మీట్‌గా పిలిచే ఈ ఉత్పత్తుల్లో రుచి, పోషకాల్లో మాంసంలో ఉండే పోషకాలకు ఏ మాత్రం తీసిపోవని తెలిపారు. అంతేకాకుండా జంతువుల నుంచి సంక్రమించే బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. సెలబ్రెటిలీలు సైతం... జంతు ప్రేమికులతో పాటు జంతువుల పక్షాన పోరాడుతున్న వీగన్ల సంఖ్య హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ వీగన్ల రాజధానిగా మారుతోంది. హైదరాబాద్ వీగన్స్‌లో 90 శాతం మంది యువతీ యువకులే కావడం విశేషం. వీగనిజాన్ని స్వీకరించి రకరకాల ప్రచారాలతో మరికొంత మందిని వీగనిజంలోకి వీరు ఆహ్వానిస్తున్నారు. వీగనిజాన్ని ప్రమోట్ చేయడానికి వీకెండ్స్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా రెస్టారెంట్లలో మనం వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మనముందు ఉంచి వెళ్లిపోతుంది. సినిమా థియేటర్‌కు వెళ్తాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. సాధారణ మానవుల నుంచి ఇప్పుడు అమల,అనుష్క శర్మ, సొనాక్షి సిన్మా, సోనమ్ కపూర్, విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీలు కూడా వీగనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడా... -
హైదరాబాద్ వీగన్లు.. ఎవరు వీళ్లు!?
వీగన్లు... ఎవరు వీళ్లు.. అందరిలాంటి మనుషులే.. కానీ సాధారణ మానవులకంటే వీళ్లు ఓ మెట్టు పైన ఉంటారని చెప్పాలి. ఎందుకంటే వీళ్లు మనమధ్య ఉన్న మానవతామూర్తులు కాబట్టి. మనుషుల మధ్య ఉన్న వివక్షల్ని దాటి.. జంతువుల పక్షాన నిలబడ్డారు కాబట్టి మనుషుల్లో వీళ్లు ప్రత్యేకమైన వాళ్లు. ఇలాంటి వీగన్ల సంఖ్య హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ వీగన్ల రాజధానిగా మారుతోంది. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కృషి చేస్తున్న హైదరాబాదీ వీగన్లను పలకరించింది సాక్షి. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకొని లైఫ్‌ని జల్సాగా గడిపే యువత హైదరాబాద్‌లో ఎక్కువగానే ఉండొచ్చు.. అలాంటి వారితో పోల్చితే ఇదే హైదరాబాద్‌లో వీళ్ల సమూహం చాలా చిన్నది. కానీ వీళ్ల ఉద్యమం విశ్వమంత పెద్దది. మనుషుల్ని ప్రేమించే వీళ్లు.. జంతువుల హక్కుల కోసం పోరాడే వీగన్లు. హైదరాబాద్ వీగన్స్ ఇది ఒక ఫేస్బుక్ పేజ్.. ఈ పేజ్‌లో మూడువేల 600 మంది సభ్యులున్నారు. వీళ్లంతా ఆహారం కోసం మొక్కలపై తప్ప జంతువులపై ఆధారపడబోమని ప్రతిక్ష చేసి వీగన్లుగా మారారు. వీగనిజాన్ని ప్రమోట్ చేసేందుకు వారాంతాల్లో చాలా కార్యక్రమాలు చేస్తోంది ఈ సమూహం. ఏ రెస్టారెంట్లలో మనం వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మనముందు ఉంచి వెళ్లిపోతుంది. సినిమా థియేటర్‌కు వెళ్తాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. వాళ్లతో మాట కలిపితే.. జంతువుల వేదనను కథలు కథలుగా చెప్తారు. హైదరాబాద్ క్రమంగా వీగన్ల రాజధానిగా మారుతోందనేందుకు ఈ జంతుప్రేమికుల కార్యక్రమాలు.. వాటికి వస్తున్న స్పందనే ఉదాహరణ. 2011లో పుల్కిత్, సేజల్ అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ వీగన్స్ మూమెంట్ ప్రారంభించారు. ఇప్పుడు వేలాదిమంది ఈ సమూహంతో చేతులు కలిపి వీగన్లుగా మారుతున్నారు. వీగన్లుగా మారేందుకు ఆహారం ప్రధాన అడ్డంకి.. పాలు కూడా లేని పదార్థాలు మాత్రమే వీళ్ల ఆహారంలో భాగం. అందుకే, ఇలాంటి పదార్థాలను ప్రమోట్ చేసి అంతా పంచుకొని తినేందుకు వీగన్ పాట్‌లాక్స్ పేరుతో సామూహిక విందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో వీగన్ ఫుడ్ అక్కడికి తీసుకొస్తారు. ఇటీవల జూబ్లిహిల్స్‌లో జరిగిన ఓ పాట్ లాక్ కార్యక్రమాన్ని సాక్షి సందర్శించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంది. -
వెగానిజం..
సిటీలో వెగానిజం ఈ మధ్య బాగా పుంజుకుంటోంది. పాలు, మాంసం, గుడ్లు, తేనెలకు బదులు వృక్షాధారిత ఉత్పత్తులను వాడటం అనే వెగానిజంను విశ్వసించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఇంటర్నేషనల్ వెగాన్స్ డే సందర్భంగా వెగాన్స్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో ప్రదర్శన సైతం నిర్వహిస్తున్నారు. బానిసత్వం, రేసిజం, లింగవివక్ష స్థాయిలో జరపవలసిన ఉద్యమం వెగానిజం అనే భావన వెగనిస్టులది. జంతువులను కష్టపెట్టకుండా, మొక్కల నుంచి వచ్చే వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటే మొక్కలకు బాధ కలగదా అంటే.. నరాల వ్యవస్థ లేని మొక్కలు బాధను గ్రహించే అవకాశం లేదంటారు. అలాగే ఒక ఆకుని తెంపితే మరో ఆకు పుట్టుకొస్తుంది. కానీ జంతువును చంపటం ద్వారా అవి మరలా వచ్చే అవకాశం ఉండదని వీరు గుర్తు చేస్తారు. పాలూ మాంసాహారమే... ప్రతి ప్రాంతంలో పాలు, పెరుగు సహా జంతు సంబంధిత ఆహారం ఆహారంలో భాగమైపోయింది. అలాంటప్పుడు వెగాన్గా మారటం అంత సులువైన విషయం కాదు. స్వీట్లు, చాక్లెట్స్, కేక్స్, ఐస్‌క్రీం, పెరుగు, పనీర్, చీజ్, పిజ్జా, టీ, కాఫీ ఇలా రోజులో తినే చాలా పదార్థాలను త్యజించాల్సి ఉంటుంది. అయితే అలవాటయిన ఈ రుచులను పూర్తిగా తినటం మానెయ్యాల్సిన పనిలేదని సిటీకి చెందిన వెగాన్స్ అంటున్నారు. మొక్కల నుంచి లభించే వాటి ద్వారా ఆయా పదార్థాలను తయారుచేసుకుంటే సరిపోతుందంటున్నారు. ఇది సరికాదు.. భూమి మీద ప్రతి జీవి వాటికి సంబంధించిన ప్రత్యేక కారణంతో మనుగడ సాగిస్తోంది. అవి మనుషుల కోసం భూమి మీదకు రాలేదు. ఇంట్లో ఒక జంతువును పెట్గా ప్రేమిస్తూ, ఆహారంగా మరో జంతువును బలిచేయడం సరైనదేనా? అని ప్రశ్నిస్తున్న వెగాన్స్... పాలు, పాల సంబంధిత ఆహారాన్ని మానేస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం అందదు అనడం అపోహేనని, మొక్కల నుంచి మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని సోదాహరణంగా వివరిస్తున్నారు. పాలు, పాలసంబంధిత పదార్థాలు లేకుండా నోరూరించే చాక్లెట్ కప్స్, కుకీస్, ఐస్‌క్రీం, పనీర్ లాంటివి సైతం తయారు చేసుకోవచ్చునంటున్నారు. వంటలున్నాయి.... - పాలతో కాకుండా పల్లీలతో చేసిన పెరుగు, పెరుగన్నం.. - సోయాబీన్స్‌తో తయారైన పనీర్ మ్యాంగో ఐస్‌క్రీం - కాజూ కట్లి - జీడిపప్పు, చక్కెరతో చేసినది - వీగన్ చాక్లెట్ బాల్స్ - కర్జూరం, కొకోవా పొడి, నట్స్ కలిపి తయారు చేసింది. - బాదం పాలు, చాక్లెట్ చిప్స్, మొక్కజొన్న ఫ్లాక్స్ తో చేసే చాక్లెట్ కప్. పాలు తాగడం అంటే పాపం చేయడమే.. మనిషి తప్ప భూమి మీద ఏ జీవి కూడా మరో జీవి పాలు తాగదు. ఆవులు, గేదెలు తమ సంతానానికి ఇవ్వవలిసిన పాలను మనుష్యులు తాగేస్తున్నారు. అంతేకాకుండా పాల ఉత్పత్తి పెరగడానికి ఆ జంతువులను నానారకాల యాతనలకు గురిచేస్తున్నారు. జీవితాంతం ఆడ గేదెలు సంతానోత్పత్తి జరిపేందుకు రకరకాల ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇక నేరుగా చంపి, వంటకు సిద్ధం చేసే జంతువుల గురించి చెప్పేదేముంది. ఇలా జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టకుండా ఆహారాన్ని సమకూర్చుకోవటం వీలవుతుందని, ఈ ఆలోచనను విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు వెగాన్స్. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెగాన్స్ కమ్యూనిటీ క్లబ్బులు కూడా ఏర్పాటు చేసి మొక్కలకు సంబంధించిన ఆహారం గురించి అవగాహన పెంపొందిస్తున్నారు. - ఓ మధు