ఏం తింటున్నాం.. ఎలా ఉంటున్నాం.. జంతువులను బాధిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మన ఆరోగ్యానికి మనమే హాని చేసుకుంటూ బతికేస్తున్నామా..?! ‘జంతువులనే కాదు, జంతు ఆధారిత ఉత్పత్తుల నుంచి కూడా దూరంగా ఉందాం.. ’ అంటూ వరల్డ్ వీగన్ డే సందర్భంగా వీగన్ ప్రేమికులు చెప్పే మాటలు అందరూ అనుసరించదగినవి, ఆచరణలో పెట్టాల్సినవి...
దుఃఖాన్ని పిండుకు తాగుతున్నాం
శాకాహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యమే కాదు, పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది. నేను యానిమల్ లవర్‌ని, యాక్టివిస్ట్‌ని. జంతువులను బాధించడానికి మనకు ఎలాంటి హక్కుల్లేవు. చాలామంది మాంసాహారం రుచి మీదనే దృష్టి పెడతారు. తరతరాలుగా ఇది అలాగే వస్తోంది. మనం తినడానికే అవి పుట్టాయని మనుషుల ఒక క్రూరమైన ఆలోచన. పాల పరిశ్రమ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద క్రూరమైన ప్రక్రియ. పాల రూపంలో వేరే జీవి బాధని గ్లాసులో పోసుకొని తాగుతున్నాం అనిపిస్తుంది. ఒక గ్లాసు పాలతో తల్లి–బిడ్డను వేరు చేస్తున్నాం. పాలు తాగుతున్న బిడ్డ మూతి కట్టి, ఆ తల్లి పాలు పిండుకుంటున్నాం. ఇవన్నీ గమనించి 13 ఏళ్లుగా వీగన్ డైట్‌కి మారిపోయాను. ఈ ప్రకృతిలో ప్రతి జీవికీ బతికే హక్కు ఉంది. జంతువుల సంఖ్య అదుపు చేయాలంటే మనం వాటిని చంపుకు తినాలి అనే మనస్తత్వం పెరిగింది. అదే జంతుజాలాన్ని నాశనం చేస్తుంది. కోళ్లకు, ఆవులకు, గేదెలకు కృత్రిమ ఇంజక్షన్లు ఇస్తారు. ఏదైనా తప్పుగా తింటే అది మన ఆరోగ్యంపైనే చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఇవన్నీ గమనించి మనమంతా వీగన్‌కి మారిపోవాల్సిందే. ఈ రోజుల్లో ఇది అత్యవసరం కూడా.
– ప్రతిమా సాగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
సాధు స్వభావానికి..
మొదట్లో మనిషి ఆహారానికి మొక్కల మీదే ఆధారపడేవాడు. ఇప్పుడంతా ఏది కరెక్ట్‌గా తినాలి, ఏది తినకూడదు అనేదానిపై చాలా అనుమానాలు ఉంటున్నాయి. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మాంసాహారానికి ఏ మాత్రం ప్రాముఖ్యం లేదు. ఇప్పుడైతే అస్సలు తీసుకోం. శాకాహారానికి సైడ్‌ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఆరోగ్యం బాగో లేకపోతే ముందు నాన్‌వెజ్ తీసుకోవద్దు అని చెబుతారు. కానీ, శాకాహారం విషయంలో అలా ఉండదు. జంతువులకు కూడా మనలాగే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. దూడ పాలు తాగాక అవి మిగిలిన పాలు తీసుకోవడం వరకు పర్లేదు. కానీ, జంతువులను బాధించి, వాటినుంచి మనం ఆహారం పొందుతున్నాం. జంతువుల మీద క్రూరత్వాన్ని చూపుతున్నా.. అదెలాగంటే ఒక జంతువును చూస్తే దానిని కొట్టాలనే ఆలోచనకే వెళుతున్నాడు మనిషి. శాకాహారం మాత్రమే తీసుకుంటే మనిషి సాధు స్వభావిగా ఉంటాడు. దీనిని మనం అర్థం చేసుకోవాలి. సమాజంలో క్రూరత్వాన్ని దూరం చేయాలంటే మన ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. వాహనసదుపాయాలు ఏవీ లేని రోజుల్లో రవాణాకు జంతువులను ఉపయోగించేవారు. ఇప్పుడు అలా లేదు. అలాగే మనలో కూడా మార్పు రావాలి.
– స్టెల్లా మరేజ్, గంధంగూడ, నార్సింగ్ , హైదరాబాద్
హింసను తెలుసుకొని..
నేను వీగన్‌గా మారి మూడేళ్లు అయ్యింది. అన్ని డెయిరీ, పౌల్ట్రీ కంపెనీలలో జరుగుతున్న హింసను తెలుసుకొని వీగన్‌గా మారిపోయాను. క్యాల్షియం కావాలంటే పాలు తాగాలంటారు. వీటి బదులు నువ్వులు తీసుకోవచ్చు. చికెన్, మీట్‌లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. వాటి గ్రోత్‌కి ఇచ్చే ఇంజక్షన్స్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు రావచ్చు. హార్మోనల్ సమస్యలు కూడా రావచ్చు. వీగన్ ఫుడ్ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థ్రరైటిస్ సమస్య తగ్గుతుంది. వీగన్ అని విని ఇదేదో పాశ్చాత్యులు తీసుకునేది, మనది కాదు అనుకోకూడదు. కానీ, ప్రాచీనకాలం నుంచి మనం చేస్తున్నదే. దీని వల్ల మన ఆరోగ్యమే కాదు, పర్యవరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
– హర్షిత వెంపటి, ఉప్పల్, హైదరాబాద్
యవ్వనంగా ఉండచ్చు
వీగన్ ఆహారం తీసుకోవడం వల్ల జంతువులను బాధించడం తగ్గించవచ్చు. మనం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. పర్యావరణానికి మేలు జరుగుతుంది. విదేశీయులు కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీగన్ డైట్‌కు మారిపోతున్నారు. ప్రకృతి మనకు ఎన్నింటినో ఫ్రీగా ఇచ్చింది. మనం వాటిని రక్షించుకోకుండా పాడు చేస్తున్నాం. జంతువులంటే ఇష్టపడేవారు, ఆరోగ్యాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలనుకునేవారు వీగన్‌కి మారిపోవడం ఎంతో మంచిది. నేను పదేళ్లుగా వీగన్ డైట్ తీసుకుంటాను. వీగన్ కెఫేని కూడా రన్ చేస్తున్నాను. పాలు, జంతు ఆధారిత ఉత్పత్తులేవీ లేకుండా వర్క్‌షాప్స్ ద్వారా అవగాహన తీసుకువస్తుంటాం.
– సిమి, సిమిస్ వరల్డ్
ప్రగతి నగర్, హైదరాబాద్
ఒక్కరాత్రిలో మారిపోయాను
మూడేళ్లుగా వీగనిజానికి మారిపోయాను. నేను మా కుక్క గాయపడటం చూశాను. అది కొన్ని రోజులు పాటు ఎంత బాధపడిందో దగ్గరగా చూశాను. కోడి, మేక బాధ కూడా అంతే కదా! ఆ ఆలోచన వచ్చి ఒక్క రాత్రిలో వీగన్‌కి మారిపోయాను. జంతువుల పాలు తీసుకోవడం కూడా మానేశాను. ఆన్‌లైన్‌లో వీగన్ డైట్ ప్లాన్ చూశాను. అందులో న్యూట్రిషన్ సాయం కూడా తీసుకోవచ్చు. మన శరీరానికి ఎలాంటి ఆహారం అనువైనది, ఎంత అవసరం అనేది ఎక్స్‌పర్ట్ సలహా తీసుకున్నాను. మన చుట్టూ ఉండే పర్యావరణం బాగుండాలంటే ముఖ్యంగా మనలో మార్పు రావాలి.
– పంచ్, వీగన్ యాక్టివిస్ట్
Comments
Please login to add a commentAdd a comment