vehicles Ban
-
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి ‘ఎండ్-ఆఫ్-లైఫ్(ఈఓఎల్-నిబంధనల ప్రకారం వాడకూడని వాహనాలు)’ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ప్రధాన కారమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని ఇంధన స్టేషన్లలో జూన్ 30, 2025 నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అధునాతన వ్యవస్థ ఈఓఎల్ వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. ఈ ఆంక్షలు ఒక్క ఢిల్లీకే పరిమితం కావని కొందరు అధికారులు తెలుపుతున్నారు. నవంబర్ 1, 2025 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ నిషేదాజ్ఞలు ఉండబోతున్నాయి. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026 నాటికి ఈ విధానం మొత్తం ఎన్సీఆర్ను పరిధిలో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యంమరోవైపు 2025 నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, వాణిజ్య గూడ్స్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) నిషేధించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో వాహన కాలుష్యం క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఈ విధానాలు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఎంతో తోడ్పడుతాయని అధికారులు తెలిపారు. -
కాలుష్యంపై కొరడా!
పర్యావరణవేత్తలు మొరపెట్టుకున్నా... మెత్తగా బతిమాలుకున్నా వినని వాహన ఉత్పత్తిదారులకు ఇప్పుడు పీకలమీదికొచ్చింది. వాతావరణంలోకి అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నవని ముద్రపడిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాల అమ్మకాలను, వాటి రిజిస్ట్రేషన్లను శనివారం నుంచి దేశంలో నిలిపేయా లని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ వాహనాల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు చిన్న తరహా, భారీ కమర్షియల్ వాహనాలు, కార్లు తది తరాలున్నాయి. ప్రస్తుతం షోరూంలలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి వాహ నాల సంఖ్య 8,24,000 అని వాహన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ద్విచక్ర వాహనాల వాటా 6,71,000 పైమాటే! వాతావరణ కాలుష్యాన్ని మరింత తగ్గించే సాంకేతికతలను అమల్లోకి తెస్తూ ఏడేళ్లక్రితం బీఎస్ 4 ప్రమాణాలు నిర్ణ యించారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కూడా మొదలైంది. అలాంటపుడు బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల ఉత్పత్తిని క్రమేపీ తగ్గిస్తూ చివరకు దాన్ని ఆపేయాలి. 2015లో కేంద్రం వెలువరించిన వాహన ఇంధన విధానంలో సైతం 2017 ఏప్రిల్ 1 కల్లా బీఎస్ 4 ప్రమాణాలను అనుసరిం చాలని నిర్దేశించారు. అప్పుడైనా వాహన ఉత్పత్తిదార్లు మేల్కొనలేదు. ఈ విధానంలో ఉన్న అస్పష్టతను వారు సాకుగా తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి వాహనాల ఉత్పత్తిని ఆపాలా, అసలు అమ్మకాలనే ఆపాలా అన్న విషయంలో అది నిర్దిష్టంగా చెప్పలేదు. అమ్మకాలనే ఆపేయాలని స్పష్టంగా చెబితే తాము అంతకు చాన్నాళ్ల ముందే వాటి ఉత్పత్తి జోలికి వెళ్లేవాళ్లం కాదని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం వాహన ఉత్పత్తిదార్లను తప్పుబట్టి ప్రయోజనం లేదు. బీఎస్ 4 వాహనాల్లో వినియోగించడానికి వీలైన పెట్రోల్, డీజిల్ తగినంతగా అందు బాటులో ఉంచడంలో చమురు సంస్థలు కూడా విఫలమయ్యాయి. చమురు శుద్ధికి నూతన సాంకేతికతలను వినియోగించడంలో అవి తాత్సారం చేస్తున్నాయి. కొత్త సాంకేతికతకు దాదాపు రూ. 80,000 కోట్లు ఖర్చవుతుందంటున్నారు. బీఎస్ 3 వాహనాల వల్ల కలుగుతున్న ముప్పు అంతా ఇంతా కాదు. ఆ వాహనాల్లో కిలో ఇంధనానికి 2.30 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలో విడుదలవుతుంది. అదే బీఎస్ 4 వాహనాలైతే కిలోకు ఒక గ్రాము కార్బన్ మోనా క్సైడ్ మాత్రమే వాతావరణంలో కలుస్తుంది. వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర కార్బన్ మోనాక్సైడ్దేనని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కొత్త సాంకేతికతకు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్ట కుండా పాత ప్రమాణాలనే కొనసాగించడంవల్ల సమస్య రోజురోజుకూ ఎక్కువవు తున్నదని వారు ఆరోపిస్తున్నారు. బీఎస్ 3 వాహనాల ఉత్పత్తిని నిలిపేందుకు అవ సరమైన చర్యలను తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. వాహన ఇంధన విధానాన్ని విడుదల చేయడమే తప్ప దానికి అనుగుణమైన చర్యలుంటున్నాయా లేదా అని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నిజానికి యూరప్ దేశాలు ఇప్పటికే యూరో 6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చాయి. రెండేళ్ల నాటి ఇంధన విధానం బీఎస్ 5ను 2020నాటికి, బీఎస్ 6ను 2024 నాటికి పాటించేలా చూడాలని నిర్ణయించారు. కానీ బీఎస్ 3 ప్రమాణాల తోనే ఇప్పటికీ వాహనాల ఉత్పత్తి అవుతుంటే కొత్త ప్రమాణాలను అమల్లోకి తెచ్చుకుని ప్రయోజనం ఏముంది? ద్విచక్ర వాహనమైనా, మరొకటైనా ఒకసారి రోడ్లపైకొస్తే అది కనీసం 20 ఏళ్లపాటు నడుస్తుంది. ఈలోగా అది విడిచిపెట్టే కాలుష్యం జనం ప్రాణాలు తోడేస్తుంది. ఆ వాహనాల పొగలో ఉండే నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటివి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులకు మాత్రమే కాదు... భూతాపం పెంచి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయి. చూడటానికి బీఎస్ 3 వాహనమైనా, బీఎస్ 4 వాహనమైనా ఒకేలా ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్స్, సెన్సర్ వ్యవస్థల్లో... ఇంజన్ కుండే సామర్ధ్యంలో ఎంతో తేడా ఉంటుంది. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దేశ ఆర్ధిక వ్యవస్థలో దాని పాత్ర అత్యంత కీలకం. నాలుగున్నర లక్షల కోట్ల టర్నోవర్ కలిగి, ప్రత్య క్షంగా పరోక్షంగా 2.5 కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఆ పరిశ్రమ జోలికి పోవాలంటే ప్రభుత్వాలు సందేహిస్తాయి. వాటికి సంబంధించి తీసుకునే ఏ నిర్ణ యమైనా వేల కోట్ల నష్టానికి, వేలాదిమంది కష్టానికి దారితీయొచ్చునని సందే హిస్తాయి. ఉత్పత్తిదారులకూ ఈ సంగతి తెలుసు. అందుకే తమకేమీ జరగదన్న భరోసాతో ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల హీరో మోటార్ కార్పొరేషన్, టీవీఎస్, హోండా లాంటి ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థలు, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, టాటా మోటార్స్, ఫోర్స్ మోటార్స్, అశోక్ లేలాండ్, అతుల్ ఆటో వంటి సంస్థల వాహనాలు అనిశ్చితిలో పడతాయి. ఈ జనవరి–మార్చి మధ్య జరిగిన ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకున్నా బీఎస్ 3 ప్రమాణాలున్న వివిధ రకాల వాహనాలు భారీగా మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు లక్షల్లో ఉంటే కమర్షియల్ వాహనాలు, కార్లు వేలల్లో ఉన్నాయి. వీటి డిజైన్లను బీఎస్ 4 ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం దాదాపు అసాధ్యం. కనుక ఈ వాహనాలను వేరే దేశాలకు తరలించి విక్రయించడం మినహా ఉత్పత్తి దారులకు మరో మార్గం లేదు. పైగా బీఎస్ 3 వాహనాల అమ్మకం ఆగిపోయే అవకాశం ఉంటుందని తెలిసినా వాటిని ఉత్పత్తి చేసి, తమకు పంపారని... అందువల్ల నష్టపోయాం గనుక పరిహారం చెల్లించాలని విక్రయ సంస్థలు పరిశ్రమలపై ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంటుంది. అటు చెల్లుబాటు కాని వాహనాలు, ఇటు విక్రయదార్ల డిమాండ్లతో వాహన పరిశ్రమకు ఊపిరాడని స్థితి. దీన్నంతటినీ గమనించి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునస్స మీక్షించుకుంటే వేరే విషయం. ఏదేమైనా వాహన ఉత్పత్తిదారుల ప్రయోజనాల కంటే తమకు ప్రజల ఆరోగ్యమే ప్రధానమని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కీలక మైనవి. -
బీఎస్–3 వాహనాలపై వేటు
⇔ సుప్రీం కోర్టు తీర్పు... ⇔ ఏప్రిల్ 1 నుంచి విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం ⇔ భారత్స్టేజ్ –4 ప్రమాణాలున్న వాటికే అనుమతి ⇔ ప్రజారోగ్యమే అత్యంత ప్రధానమన్న ధర్మాసనం న్యూఢిల్లీ: రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండడంతో భారత్ స్టేజ్ (బీఎస్)– 4 కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాలను నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. సుప్రీం తీర్పు వాహన పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఆటోమొబైల్ తయారీదారుల ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే చాలా చాలా ప్రధానమైందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీఎస్ – 4 ప్రమాణాలను అందుకోలేని వాహనాలను తయారీ దారులు గానీ, డీలర్లు గానీ ఏప్రిల్ 1 నుంచి విక్రయించడానికి అనుమతి లేదని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మోటారు వాహనాల చట్టం 1988 కింద బీఎస్ – 4 ప్రమాణాలను చేరుకోలేని వాహనాలను అధికారులు రిజిష్టర్ చేయరాదని కోర్టు ఆదేశించింది. మార్చి 31లోపు వాహనాలు విక్రయమైనట్టు ఏదైనా రుజువు చూపిస్తే తప్ప వాటి రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 1 తర్వాత అవకాశం లేదని తేల్చి చెప్పింది. తమ తీర్పునకు గల పూర్తి కారణాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. దేశవ్యాప్తంగా బీఎస్–4 ఉద్గార ప్రమాణాలు వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్ – 3 ప్రమాణాల వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వ్ చేయగా బుధవారం ఆదేశాలు వెలువరించింది. బీఎస్ – 4 ప్రమాణాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయన్న విషయంలో అవగాహన ఉన్నప్పటికీ వాహన తయారీదారులు అందుకు తగిన చర్యలు చేపట్టలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కాగా, ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ బీఎస్ –3 ప్రమాణాల వాహనాలు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని ఇదివరకే సుప్రీం కోర్టుకు నివేదించింది. కంపెనీల వద్ద 8.24 లక్షల బీఎస్ – 3 వాహనాలు ఉన్నాయని, వీటిలో 96,000 వాణిజ్య వాహనాలు, 6 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, 40,000 త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. గతంలో బీఎస్ – 2కి, బీఎస్ –3కి మారినప్పుడు పాత ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్పటికే మిగిలి ఉన్న వాహనాల విక్రయానికి అనుమతించిన విషయాన్నీ సియామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. పర్యావరణ వేత్తల హర్షం పర్యావరణ సంస్థలు మాత్రం సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. వాయు కాలుష్యంపై పోరాటం దిశగా ఇది సరైన అడుగు అని అభివర్ణించాయి. బీఎస్ – 3 నుంచి, 4కి మారడం అన్నది చాలా అవసరమని, దీనివల్ల ఉద్గారాల పర్టిక్యుల్స్ గణనీయంగా తగ్గుతాయని పర్యావరణ నిపుణులు పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రజారోగ్యం విషయంలో ఆందోళనలను పట్టించుకుని ముందుకు వెళ్లాల్సి ఉందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితారాయ్ చౌదరి పేర్కొన్నారు. పరిశ్రమపై భారం: రాకేశ్బాత్రా ‘‘సుప్రీం తీర్పు కారణంగా మొత్తం ఆటోమొబైల్ సరఫరా వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడతాయి. బీఎస్ – 4 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ, జీఎస్టీ అమలుతో వ్యయాలు పెరిగిపోతాయి’’అని ఆటోమొబైల్ రంగ ప్రముఖుడు, ఈవై పార్ట్నర్ రాకేశ్ బాత్ర పేర్కొన్నారు. ఆటో స్టాక్స్‌కు నష్టాలు సుప్రీం తీర్పుతో ఆటోమొబైల్ స్టాక్స్ ధరలు బుధవారం స్టాక్ మార్కెట్లలో నష్టాలను చవిచూశాయి. హీరో మోటోకార్ప్ 3.15 శాతం, అశోక్‌లేలాండ్ 2.78 శాతం, భారత్ ఫోర్జ్ 1.30 శాతం, టాటా మోటార్స్ 0.70 శాతం వరకు నష్టపోయాయి. ఉన్న వాహనాల పరిస్థితి ఏంటి..? బీఎస్ – 3 ఆటోమొబైల్ వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో కంపెనీలు, డీలర్లకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాహన తయారీదారులు, డీలర్ల వద్ద ప్రస్తుతం కనీసం 7 లక్షలకు తక్కువ కాకుండా వాహనాలుంటాయని అంచనా. తాజా తీర్పు కారణంగా మార్చి 31తో మిగిలి పోయిన వాహనాలను ఎగుమతి చేయడం ఒక్కటే కంపెనీల ముందున్న మార్గంగా కనిపిస్తోంది. మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, బంగ్లాదేశ్ తదితర మార్కెట్లలో ప్రస్తుతం బీఎస్ – 3 ప్రమాణాలే అమల్లో ఉన్నాయి. కనుక ఆయా మార్కెట్లలో ఈ వాహనాల విక్రయానికి దాదాపు అవరోధాలుండవు. టాటా మోటార్స్ తన బీఎస్ – 3 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం ఉందని టైగర్ మోడల్ విడుదల సందర్భంగా కంపెనీ ఎండీ గుంటర్ బుచెక్ స్పష్టం చేశారు. తయారీదారుల నిర్వచనం ప్రకారం... ప్రస్తుతం విక్రయం అవుతున్న బీఎస్ – 3 ఇంజన్లు గల ద్విచక్ర, త్రిచక్ర, వాణిజ్య వాహనాలు బీఎస్ – 4 ప్రమాణాల ఇంజన్ల కంటే 80 శాతం ఎక్కువగా కాలుష్యాన్ని (పర్టిక్యులేట్ మ్యాటర్) గాల్లోకి విడుదల చేస్తాయి. నిరాశపరిచింది: సియామ్ సుప్రీంకోర్టు తీర్పు తమను నిరాశపరిచిందని సియామ్ తెలిపింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాల్సి ఉందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి అన్నారు. ప్రస్తుత చట్టం బీఎస్ – 3 వాహనాల విక్రయానికి అనుమతిస్తున్న వాస్తవాన్ని విస్మరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఏప్రిల్ 1 తర్వాత కూడా బీఎస్ – 3 వాహనాలను విక్రయించేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ అవకాశం కల్పించింది. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని నిషేధించారు. ఇలా జరగడం నిరాశకు గురి చేసింది‘‘ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీఎస్ – 4 ఇంధనం అందుబాటులో ఉందా అన్న అంశంపైనే పరిశ్రమ ఆందోళనగా దాసరి చెప్పారు. వాణిజ్య వాహన తయారీదారులు బీఎస్ – 4 యూనిట్లను 2010 నుంచే తయారు చేస్తున్నప్పటికీ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బీఎస్ – 3 వాహనాలను విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. అశోక్‌లేలాండ్ ఎండీ కూడా అయిన దాసరి తాజా తీర్పు ప్రభావం తమ కంపెనీపై పరిమితమేనన్నారు. కంపెనీల మాట ఇదీ... బజాజ్ ఆటో: కొన్నింటికి వెల కట్టలేమని, ఇది మన చిన్నారుల భవిష్యత్తు కోసమని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ సుప్రీం తీర్పునకు మద్దతుగా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 1 నుంచి తయారీ, విక్రయాలు వద్దని చెప్పినప్పటికీ రాతపూర్వకంగా ఏముందో చూడాలన్నారు. టయోటా: ‘‘భారత్‌లో మేము ప్రస్తుతం విక్రయిస్తున్న వాహనాలన్నీ బీఎస్ –4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే. ఏడాది క్రితమే బీఎస్ – 3 వాహనాల తయారీని నిలిపివేశాం. కాలుష్య ఉద్గారాలు, భద్రత విషయంలో మనం అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకోవాల్సి ఉంది’’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ వీసీ విక్రమ్ కిర్లోస్కర్ పేర్కొన్నారు. హోండా మోటార్‌సైకిల్: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. మా ఉత్పత్తులన్నీ బీఎస్ – 4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవే.