రాత్రికిరాత్రే 50 కార్లను చిత్తుచిత్తు చేశారు
మంద్సౌర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం మంద్సౌర్ పట్టణం మరోసారి వార్తలోకి వచ్చింది. మంగళవారం అర్థరరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు.. ఒక వర్గం వారి కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీరియస్గా తీసుకున్న పోలీసులు సత్వరమే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
కొత్వాలీ ప్రాంతంలోని ఒకే వర్గానికి చెందిన వారి ఇళ్ల వద్ద పార్క్ చేసి ఉన్న దాదాపు 50 కార్లను ఆగంతకులు ధ్వంసం చేశారు. తెల్లవారు జామున 2.30 నుంచి 3 గంటల వరకు దుండగులు స్వైరవిహారం చేశారు. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పోలీసులు బైక్పై వెళ్తున్న అగంతకులను గుర్తించి వెంటాడినా వారు తప్పించుకుపోయారు.
కాగా, ఈ ఘటనతో తీవ్రంగా ఆగ్రహించిన కార్ల యజమానులు జాతీయ రహదారిపై కొద్దిసేపు ధ్వంసమైన తమ కార్లతో ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు నిందితులను గర్తించే పనిలో పడ్డారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ పట్టణంలో ఆందోళన జరుపుతున్న రైతులపై జరిపిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు చనిపోయిన విషయం విదితమే.