బురఖా లేని ఫొటో పోస్ట్ చేసిందని...
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె నేరం ఏమిటంటే, బహిరంగ ప్రదేశంలో బురఖా లేకుండా తిరగడంతో పాటు.. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయడం. పోలీసు ప్రతినిధి ఫవాజ్ అల్ మైమన్ ఆమె పేరు చెప్పలేదు గానీ, పలు వెబ్సైట్లు మాత్రం ఆమె పేరు మలక్ అల్ హెహరీ అని చెప్పాయి. గత నెలలో రియాద్‌లోని ఓ మెయిన్‌రోడ్డులో బురఖా లేకుండా ఫొటో తీయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెపై కామెంట్లతో పలువురు విరుచుకుపడ్డారు.
ఆమె సాధారణ నైతిక నియమాలను ఉల్లంఘించినందుకు తమ విధులు నిర్వర్తించినట్లు పోలీసు ప్రతినిధి మైమన్ తెలిపారు. సౌదీ సమాజంలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడం తప్పనిసరని, కానీ ఆమె మాత్రం రియాద్‌లోని ఓ ప్రముఖ కేఫ్ పక్కన ముసుగు లేకుండా నిలబడి ఫొటో తీయించుకుని దాన్ని ట్వీట్ చేసిందని చెప్పారు. ఆమెను అరెస్టుచేసి జైల్లో పెట్టామన్నారు. ''నిషేధించిన సంబంధాల'' గురించి తనకు సంబంధం లేని పురుషులతో మాట్లాడినట్లు కూడా ఆమెపై ఆరోపణలొచ్చాయి. దేశంలో అమలవుతున్న చట్టాలను ఆమె స్పష్టంగా ఉల్లంఘించినట్లు రియాద్ పోలీసులు చెప్పారు. ఇస్లాం బోధనలకు ప్రజలు కట్టుబడి ఉండాలని కోరారు.