vein surgery
-
హైదరాబాద్లో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్
సాక్షి,హైదరాబాద్ : మన దేశంలో దాదాపు 25 శాతం మంది ప్రజలు వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారని, వీళ్లలో చాలామందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండానే నయం చేయొచ్చని జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుతమైన చికిత్సలు చేయొచ్చని వివరించారు. నగరంలోని అవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాదాపూర్లో గల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్రవారం నిర్వహించారు. దీనికి అవిస్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు, ప్రముఖ వాస్క్యులర్ ఇంటర్వెన్షనల్ నిపుణుడు డాక్టర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 100 మంది వరకు వైద్య నిపుణులు దీనికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. బ్రెజిల్ నుంచి కొందరు నిపుణులు ఆన్లైన్లో హాజరై తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకున్నారు.ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ సమస్యను శస్త్రచికిత్సలు అవసరం లేకుండా లేజర్ల ద్వారా, ఇతర మార్గాల్లో నయం చేయడం ఎలాగన్న అంశంపై ఇందులో విస్తృతంగా చర్చించారు. అవిస్ ఆస్పత్రిలో గత ఎనిమిదేళ్లుగా ఇప్పటికి దాదాపు 40 వేల మందికి పైగా రోగులకు శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేశామని, ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ రాజా వి. కొప్పాల అన్నారు.అంతర్జాతీయంగా పేరున్న డాక్టర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్టర్ రాజేష్ వాసు, డాక్టర్ ఫెర్రనాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యులర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు ఈ సదస్సుకు హాజరై.. అంతర్జాతీయంగా ఈ రంగంలో వస్తున్న పలు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించారు. వీరితో పాటు వాస్క్యులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అవసరం లేదని, అయితే కొన్నిసార్లు తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు.వెరికోస్ వెయిన్స్ విషయంలో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన సముపార్జన చేయాలని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్టర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు. -
సెల్ఫీలంటే మరీ అంత పిచ్చా!
లండన్: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్థమాన దేశాల యువతీ యువకుల్లో సెల్ఫీలు తీసుకోవడం పట్ల మోజు రోజురోజుకు పెరుగుతోంది. లండన్ యువతుల్లో మాత్రం ఈ మోజు మరీ పిచ్చి స్థాయికి చేరుకొంది. సెల్ఫీల్లో ముఖాలు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ముఖ చర్మం కింద దారపు పోగుల్లా ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకుంటున్నారు. 40 ఏళ్ల లోపుండే యువతులు ఎక్కువగా శస్త్ర చికిత్సలను ఆశ్రయిస్తున్నారని, సాధారణంగా మేకప్ చేసుకొంటే ఈ సిరలు బయటకు కనిపించవని, మేకప్ లేకుండా సెల్ఫీలు దిగడం ఓ మోజుగా మారిందని, అందుకే వారు శస్త్ర చికిత్సలకు ముందుకొస్తున్నారని లండన్ వైద్యులు తెలిపారు. లండన్లో గత ఆరునెలల కాలంలోనే 40 ఏళ్లలోపు యువతుల్లో 15 శాతం మంది తమ ముఖాల చర్మం కింద ఉండే సిరలను శస్త్ర చికిత్సల ద్వారా తొలగించుకున్నారని వారు చెప్పారు. సూపర్ స్టార్స్ జెన్నీఫర్ లోపెజ్, జెన్నీఫర్ అనిస్టన్, రిహన్నా, గ్వినెథ్ పాల్త్రో, రోజీ హంటింగ్టన్లాంటి వారు మేకప్ లేకుండా సెల్ఫీలు దిగుతూ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నారని, దేన్నో చూసి ఏదో వాత పెట్టుకున్నట్టు వారి బాటలోనే లండన్ యువతరం పయనిస్తోంది. ఇలాంటి శస్త్ర చికిత్సలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవా? అని డాక్టర్లను మీడియా ప్రతినిధులు అడిగితే ‘ఎవరి పిచ్చి వారికానందం’ అంటూ అసలు విషయాన్ని దాట వేస్తున్నారు. హైరెసల్యూషన్ కలిగిన హెచ్డీ కెమేరాలు, స్మార్ట్ఫోన్ కెమేరాలు అందుబాటులోకి రావడంతో ముఖచర్మం కింద ఉండే సిరలు సెల్ఫీల్లో కనిపిస్తున్నాయని, అందుకే వాటిని తొలగించుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారని డాక్టర్ న్యూమాన్స్ క్లినిక్ మెడికల్ డెరైక్టర్ డాక్టర్ పీటర్ ఫనిగన్ చెప్పారు. అమెరికాలో కూడా ఓ మోజీ ఇటీవల విపరీతంగా పెరిగిపోయిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ వెల్లడించింది. సామాజిక వెబ్సట్లలో ఫొటోలు పోస్ట్చేసే అమెరికన్ల సంఖ్య 2006లో 79 శాతం ఉండగా, ఇప్పుడది 91 శాతానికి చేరుకుందని ఆ రీసర్చ్ సెంటర్ పేర్కొంది. వాస్తవానికి లండన్లో ఏడాది క్రితం క్యాన్సర్ రీసర్చ్ విరాళాల కోసం సినిమా తారలు సెల్ఫీలు తీసుకొని సామాజిక మీడియాలో వాటిని పోస్ట్ చేయడం మొదలైంది. విరాళాల కోసం మొదలైన ఆ ఉద్యమం ముగిసిపోయినప్పటికీ ఇప్పటికీ జెన్నీఫర్ అనిస్టన్, జెన్నీఫర్ లోపెజ్ లాంటి తారలు ఇప్పటికీ సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. వారికి తందాన అంటూ తాళం వేస్తున్న లండన్ యువతులు తగుదునమ్మా అంటూ సెల్ఫీల మీద సెల్ఫీలు పోస్టు చేస్తున్నారు. ఇక అది ఆదృష్టమో దురదృష్టమో చూసేవాళ్లే తేల్చుకోవాలి!